బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ చిత్ర పరిశ్రమకు వచ్చి 30 ఏళ్లవుతున్నది. మూడు దశాబ్దాల కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించారాయన. ఏ ఇమేజ్‌కు కట్టుబడకుండా యాక్షన్, కామెడీ, హారర్, రొమాంటిక్, పీరియాడికల్…ఇలా ప్రతి తరహా చిత్రంలోనూ మెప్పించారు. గత పదేళ్లలో అక్షయ్ కుమార్ తన జోరు చూపిస్తూ సాటి హీరోలు ఆశ్చర్యపోయేలా చేశారు.
అక్షయ్ థర్టీ ఇయర్స్ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పలువురు దర్శకులు హీరోగా ఆయన ప్రత్యేకతను వివరించారు. దర్శకుడు కరణ్ జోహార్ మాట్లాడుతూ…‘అక్షయ్ కుమార్ ప్రస్తావన లేకుండా హిందీ చిత్ర పరిశ్రమ గురించి చెప్పలేం. ఆయన 30 ఏళ్ల ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. గత పదేళ్లలో తన బలమేంటో నిరూపించుకున్నారు. అతనే ఒక పరిశ్రమ అనేంత జోరుగా సినిమాలు చేశారు. ఆయన కొత్త సినిమా ‘సమ్రాట్ పృథ్వీరాజ్’ కూడా తెరపై గొప్ప అనుభూతిని అందించబోతున్నది’ అన్నారు. దర్శకులు ఆర్ బాల్కీ, ఆనంద్ ఎల్ రాయ్, సాజిద్ నదియావాలా, సుభాష్ కపూర్ తదితరులు అక్షయ్ ప్రతిభ గురించి మాట్లాడారు.