Akkineni Nageswararao | ఇది అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswararao) తొలి సినిమా ‘ధర్మపత్ని’(1941) నాటి ముచ్చట. ఆ సినిమాకు దర్శకుడు పి.పుల్లయ్యగారు. స్వతహాగా ఆయనకు కాస్తంత నోటి దురుసు. తనకంటే చిన్నవాళ్లనుకుంటే ఆలోచించకుండా నోరుజారేవారట. ‘ధర్మపత్ని’ (Dharmapatni) టైమ్‌కి అక్కినేని వయసు 17ఏళ్లు. టీనేజ్‌లో ఉన్నారు. నాటకరంగం నుంచి వచ్చినవాడు కావడం చేత పద్యాలు బాగా పాడేవారు. దానికి తగ్గట్టు అక్కినేని గాత్రం కూడా శృతిశుద్ధంగా శ్రావ్యంగా ఉండేది. పుల్లయ్యగారు షూటింగ్ విరామంలో అక్కినేనితో సరదాగా పద్యాలు పాడించుకునేవారు. ఓరోజు లొకేషన్‌కి కొందరు అతిథులు వచ్చారు.
పుల్లయ్యగారు వాళ్లతో పిచ్చాపాటీ మాట్లాడుతూ.. మాటల్లో అక్కినేని పద్యాలు గుర్తుకొచ్చీ, ఆయన్ను పిలిచి అందరిముందు పాడమన్నారు. అక్కినేని బెరకు లేకుండా, బాగా వచ్చిన ఓ పద్యాన్ని ఎత్తుకున్నారు. అయితే.. అది గతంలో చాలాసార్లు పాడిన పద్యం కావడంచేత ‘ప్రతిసారీ ఇదే పద్యం పాడతావేంట్రా..’ అంటూ అనకూడదని ‘ముతక మాట’ అందరిముందూ అనేశారట పుల్లయ్య. అంతే.. అక్కినేని కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. బాధతో మెరీనా బీచ్‌కి వెళ్లి ఇసుక తిన్నెలపై కూలబడి చాలాసేపు ఏడ్చేశారట.
Dharma Patni
కాలచక్రం గిర్రున 13ఏళ్లు తిరిగింది. ఇప్పుడు అక్కినేని సూపర్‌స్టార్. పుల్లయ్యగారు (Ardhangi) ‘అర్ధాంగి’(1954) సినిమాను తలపెట్టారు. అందులో అన్న పాత్రకు ఎన్టీయార్, చెడ్డవాడైన తమ్ముడి పాత్రకు ఏఎన్నార్‌ని అనుకున్నారు. ముందు తమ్ముడి పాత్రకు ఒప్పించడానికి స్వయంగా పుల్లయ్యగారే అక్కినేని ఇంటికి వెళ్లారు. కథ వివరంగా చెప్పి, ‘అన్నగా రామారావు అనుకుంటున్నాను. తమ్ముడిగా నువ్వు చేస్తే బావుంటుంది.. నెగిటీవ్ రోల్ నీక్కూడా కొత్తగా ఉంటుంది..’ అన్నారట. అంతే అక్కినేని తడుముకోకుండా.. ‘ఎందుకులేండీ.. మళ్లీ లొకేషన్లో అందరిముందూ మీరూ..’ అంటూ ఆ ‘ముతక మాట’ను ప్రస్తావించారంట. అంతే.. ఖంగు తినడం పుల్లయ్య వంతయింది.. ‘ఓరి నీ దుంపదెగ.. అప్పుడంటే చిన్నపిల్లాడివి.. చనువుకొద్దీ అనేశాను.. ఇంకా గుర్తుపెట్టుకున్నావా?’ అంటూ సతమతమైపోయారట పాపం పుల్లయ్య.
చివరకు అక్కినేనే ఆయనకు సర్దిచెప్పి.. ‘తమ్ముడి పాత్ర కాదు.. అన్న పాత్ర అయితే చేస్తాను.. తమ్ముడిగా వేరెవర్నయినా తీసుకోండి’ అనడంతో, అప్పటికింకా ఆ కథ గురించి ఎన్టీయార్‌తో సంప్రదించలేదు గనుక, ఎన్టీయార్ అనుకున్న పాత్రకు ఏఎన్నార్‌ని తీసుకొని, ఏఎన్నార్ పాత్రకు జగ్గయ్యను ఎంపిక చేసి సినిమా తీసేశారు పుల్లయ్య. టైటిల్‌రోల్ సావిత్రి చేశారు. సినిమా బాగా ఆడిందని అప్పట్లో టాక్. మొత్తంగా చెప్పేదేంటంటే మనసుకు గాయమైతే అది అంత తేలిగ్గా సమసిపోదు.. ముఖ్యంగా అక్కినేని లాంటివాళ్లు అసలు మర్చిపోరు. ఆయనది ధర్మాగ్రహం.