Akkineni Akhil | అక్కినేని మూడో తరం హీరోలు నాగ చైతన్య, అఖిల్ ఇప్పుడిప్పుడే కెరీర్లో గాడిన పడుతున్నారు. నాగ చైతన్య తండేల్ చిత్రం పెద్ద హిట్ కాగా, అఖిల్ కూడా తన తదుపరి సినిమాతో భారీ హిట్ కొట్టడం ఖాయం అనే టాక్ వినిపిస్తుంది. కెరీర్ విషయం కాసేపు పక్కన వెడితే వీరి పర్సనల్ లైఫ్ కాస్త డిస్ట్రబ్ అయింది. నాగ చైతన్య.. సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నా కొద్ది రోజుల తర్వాత వారిద్దరు విడిపోయారు. ఇక అఖిల్… శ్రేయా భూపాల్‌తో నిశ్చితార్థం చేసుకున్నా ఆ రిలేషన్ పెళ్లి వరకు వెళ్లలేదు. అయితే నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య 2024 డిసెంబర్ లో నటి శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట సంతోషంగానే ఉంది.
ఇక అఖిల్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె జైనబ్‌తో అఖిల్ నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం నవంబర్ 26న వీరి నిశ్చితార్థం జరగగా, అందుకు సంబంధించిన ఫొటోలని నాగార్జున తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక నిశ్చితార్థం తర్వాత ఈ జంట పలుమార్లు ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. సరదాగా వెకేషన్స్‌కి వెళుతూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అక్కినేని అఖిల్ వివాహం ఖరారైనట్లు తెలుస్తోంది. జూన్ 6న ఆయన పెళ్లి జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన అయితే రావలసి ఉంది. ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు.
అక్కినేని అఖిల్ సిసింద్రీ (1994) చిత్రంతో బాల నటుడిగా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు. ఇక అఖిల్ (2015) సినిమాతో పూర్తిస్థాయి హీరోగా అరంగేట్రం చేశాడు . హీరోగా తొలి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నా కాని ప్రేక్షకులని అంతగా మెప్పించలేకపోయాడు. ఆ తర్వాత హలో (2017), మిస్టర్ మజ్ను (2019), మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (2021) చిత్రాలు చేశాడు. గతేడాది ఏజెంట్ చిత్రంతో పలకరించాడు. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా హిట్ అనేది అందుకోలేకపోతున్నాడు. ఇక ప్రస్తుతం అఖిల్ లెనిన్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల రిలీజైన టైటిల్ టీజర్ మాత్రం సినిమాపై భారీ అంచనాలే పెంచింది.