అక్కినేని అఖిల్ హీరోగా నటించిన సినిమా ‘ఏజెంట్’. యాక్షన్ స్పై థ్రిల్లర్ కథతో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. సాక్షి వైద్య నాయిక. మలయాళ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఏపీలోని కాకినాడలో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ…‘ఈ సినిమాతో రెండేండ్ల ప్రయాణం చేశాను. మీరు చూపించే అభిమానమే ఈ ప్రయాణాన్ని సాగించే ధైర్యాన్నిచ్చింది. నన్ను ఈ మేకోవర్‌లో చూపించాలనే ఆలోచన దర్శకుడిదే.
నేను కూడా నన్ను ఇలా ఊహించుకోలేదు. ఈ సినిమాలో నటిస్తున్న క్రమంలో మానసికంగా ఎంతో మారాను. నటుడిగా రిస్క్ తీసుకునే ధైర్యాన్ని ఈ సినిమా ఇచ్చింది. నటి సాక్షి వైద్య మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. సినిమా కోసం సాంకేతిక నిపుణులంతా శ్రమించారు. థియేటర్లో మిమ్మల్ని కలుస్తాను’ అన్నారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ…‘సినిమా విడుదలయ్యాక ఏజెంట్ అంటే ఒక రూపం గుర్తుకురావాలి. అది అఖిల్‌లా ఉండాలని అనుకున్నాం. దర్శకుడు సురేందర్ రెడ్డి కోరిక కూడా ఇదే. రెండేండ్లు సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డాడు. ఆరు దేశాల్లో వివిధ లొకేషన్స్‌లో చేసిన యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకుంటాయి’ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నాయిక సాక్షి వైద్య తదితరులు పాల్గొన్నారు.