అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ: తాండవం’ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానున్న విషయం తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. శుక్రవారం కర్ణాటకలో జరిగిన ఈవెంట్లో ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ అంశాలతో, సనాతనధర్మం గొప్పతనం తెలియజేస్తూ ఎమోషనల్‌గా సాగింది. ‘కష్టం వస్తే దేవుడొస్తాడు అని నమ్మిన జనానికి.. కష్టం వచ్చినా దేవుడు రాడని నమ్మించాలి.. అలా వాళ్లు నమ్మిన రోజు భారతదేశం తునాతునకలైపోతుంది..’ అని విలన్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. కథపై ఆసక్తిని రేకెత్తించేలా మహాకుంభమేళా విజువల్స్ కనిపించాయి. ట్రైలర్లో శత్రుదేశాలు, క్షుద్రశక్తులు దేశంపై విరుచుకుపడుతున్నాయి..
మరోవైపు రక్తబంధాలు ఎవరి రాకకోసమో ఎదురు చూస్తున్నాయి. అఖండ సికిందర్ అఘోరా ఆగమనంతో ట్రైలర్ పీక్స్‌కి చేరింది. ‘ఈ ప్రపంచంలో ఏ దేశమెళ్లినా మీకక్కడ కనిపించేది మతం.. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ధర్మం.. సనాతన హైందవ ధర్మం..’, ‘దేశం జోలికొస్తే మీరు దండిస్తారు.. దైవం జోలికొస్తే మేం ఖండిస్తాం.. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్..’ అని అఖండ అఘోరాగా బాలకృష్ణ చెప్పిన డైలాగులు గూజ్బంప్స్ తెప్పించాయి. తమన్ ఇచ్చిన బీజీఎం బాక్సులు బద్దలయ్యేలా ఉంది. ‘ఇప్పటివరకూ ప్రపంచపటంలో నాదేశం రూపాన్ని మాత్రమే చూసుంటావ్.. ఎప్పుడూ నాదేశ విశ్వరూపాన్ని చూసుండవ్.. మేం ఒక్కసారి లేచి శబ్దం చేస్తే.. ఈ ప్రపంచమే నిశ్శబ్దం’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ముగిసింది.