సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో బాలకృష్ణ ‘అఖండ 2- తాండవం’ ముందు వరుసలో ఉంటుంది. హ్యాట్రిక్ హిట్స్ సింహా, లెజెండ్, అఖండ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటిశ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘అఖండ-2’పై అంచనాలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి. పైగా బాలకృష్ణ కెరీర్లో వస్తున్న తొలి పానిండియా సినిమా ‘అఖండ 2’ కావడం విశేషం. చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట దాదాపు 200కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పక్కా ప్లానింగ్‌తో శరవేగంగా జరుగుతున్నది. ఇందులో అఖండ రుద్ర సికిందర్ అఘోరాగా బాలయ్య నటవిరాట్ స్వరూపాన్ని చూస్తారని మేకర్స్ చెబుతున్నారు. ఇదిలావుంటే.. ఈ సినిమా కొన్ని కారణాలవల్ల దసరా రేస్ నుంచి తప్పుకుందని, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుందంటూ పలు రూమర్లు సోషల్ మీడియాలో వినిపించాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ శనివారం బోయపాటి పుట్టినరోజు సందర్భంగా ఎక్స్‌లో చిత్ర నిర్మాతలు ఓ పోస్ట్ పెట్టారు. ‘థియేటర్లలో మాస్ హిస్టీరియాను సృష్టించే క్రియేటర్.. మా ‘అఖండ 2’ దర్శకుడు బోయపాటి శ్రీనుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. సెప్టెంబర్ 25న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా ‘అఖండ 2 – తాండవం’ విడుదల కానుంది’ అనేది ఈ పోస్ట్ సారాంశం. దీంతో ‘అఖండ 2’ విడుదలపై వస్తున్న రూమర్లన్నింటికీ పుల్‌స్టాప్ పడింది. అంటే.. థియేటర్లలో అఖండ తాండవం సెప్టెంబర్‌లోనే అన్నమాట.