Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘అఖండ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, రిలీజ్ మొదటి రోజునుంచే భారీ రెస్పాన్స్ అందుకుంటూ థియేటర్లలో సందడి చేస్తోంది. బాలయ్య తన పవర్ఫుల్ నటనతో మరోసారి అభిమానులను ఉర్రూతలూగించగా, బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా బాలకృష్ణ డైలాగ్ డెలివరీ, ఇంటెన్స్ యాక్షన్ సీన్స్, ఎమోషనల్ ఎలివేషన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
థియేటర్లలో ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ చూస్తే, ‘అఖండ’ సిరీస్‌పై ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్‌తో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ విజయం నేపథ్యంలో హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను తాజాగా కాశీకి వెళ్లినట్లు సమాచారం. కాశీ విశ్వనాథుని దర్శించుకుని, సినిమా విజయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, డిసెంబర్ 19న అక్కడే మీడియాతో ముచ్చటించే అవకాశముందని చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. ‘అఖండ 2’కు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణపై బాలయ్య స్పందన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్గా సంయుక్త నటించగా, చిన్ననాటి కీలక పాత్రలో హర్షాలి మల్హోత్ర ఆకట్టుకుంది. ఆమె పాత్రకు కూడా మంచి స్పందన లభిస్తోంది. ఇక సినిమాకు సంగీత దర్శకుడు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో థమన్ మ్యూజిక్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ‘అఖండ 2’ను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించగా, నిర్మాణ విలువలు కూడా సినిమాకు ప్లస్‌గా నిలిచాయి. మొత్తంగా బాలకృష్ణ కెరీర్లో మరో భారీ హిట్‌గా ‘అఖండ 2’ నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద సినిమా రన్ ఇంకా బలంగా కొనసాగుతుండటంతో, వచ్చే రోజుల్లో మరిన్ని రికార్డులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.