రివ్యూ – చోర్ బజార్
నటీనటులు : ఆకాష్ పూరి, గెహనా సిప్పీ, అర్చన, సునీల్, సుబ్బరాజు, సంపూర్ణేష్ బాబు, ప్రవీణ్ తదితరులు
సాంకేతిక నిపుణులు : సినిమాటోగ్రఫీ – జగదీష్ చీకటి, సంగీతం – సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ – అన్వర్ అలీ, ప్రభు దేవా, ఫైట్స్ – ఫృథ్వీ శేఖర్, కొరియోగ్రఫీ – భాను, బ్యానర్ – ఐ.వి ప్రొడక్షన్స్, నిర్మాత – వీ.ఎస్ రాజు, రచన, దర్శకత్వం – జీవన్ రెడ్డి.
ఈ వారం చిన్న చిత్రాలన్నీ క్లియరెన్స్ సేల్ లా ఒక్కసారిగా థియేటర్లకు వచ్చేశాయి. వాటిలో మాస్ అంశాలతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన సినిమా చోర్ బజార్. ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా దర్శకుడు జీవన్ రెడ్డి ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
ఇదీ కథ:
కొన్ని సేకరించి, మరికొన్ని దొంగిలించి చోర్ బజార్ లో అమ్మి జీవనం సాగిస్తుంటారు అక్కడి స్థానికులు. వీళ్లలో ఒక యువకుడు బచ్చన్ సాబ్ (ఆకాష్ పూరి), ఆయనకు తల్లి బేబి (అర్చన) అంటే ప్రాణం. తల్లితో సమానంగా సిమ్రాన్ (గెహనా సిప్పీ) అనే మూగ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు హీరో. పార్క్ చేసిన టైర్స్ విప్పేసి అమ్మడం ఆయన వృత్తి. 200 కోట్ల రూపాయల విలువైన వజ్రం ఒకటి దొంగతనానికి గురై చోర్ బజార్ చేరుతుంది. ఈ వజ్రాన్ని దక్కించుకోవాలని స్మగ్లర్స్ చార్లీ, మాంజా (సంపూర్ణేష్ బాబు), హోమంత్రి (సునీల్) ప్రయత్నిస్తుంటారు. తక్కువ ధరకు వస్తువులు అమ్మడం అక్కడున్న వ్యాపారి (సుబ్బరాజు)కు నచ్చదు. కోర్టులో కేసు వేయించి చోర్ బజార్ మూయించేస్తాడు. మరోవైపు ఈ వజ్రం చోర్ బజార్ నుంచి బయటకు పోకూడదంటే బజార్ ను తెరిపించాలని హోమంత్రి పట్టుదలగా ఉంటాడు. ఇంత పోటీలో వజ్రం ఎవరికి దక్కింది. ఈ డ్రామా కథను ఎలాంటి మలుపులు తిప్పింది. బచ్చన్ సాబ్, సిమ్రాన్ ప్రేమకు ఎదురైన అడ్డంకులు ఏంటి వాటిని ఎలా అధిగమించాడు అనేది మిగిలిన కథ.
ఫ్లస్ పాయింట్స్:
ఆకాష్ పూరి నటన
కొన్ని కామెడీ సీన్స్
పాటలు
మైనస్ పాయింట్స్:
లక్ష్యమంటూ లేని పాత్రలు
సాగతీత సన్నివేశాలు
ఆకట్టుకోని చోర్ బజార్ నేపథ్యం
ఎలా ఉందంటే:
చోర్ బజార్ అనే ప్రాంతం ప్రేక్షకులకు కొత్త. ఇప్పటిదాకా ఈ ప్రాంత నేపథ్యాన్ని ఉపయోగించి ఏ సినిమా తెరకెక్కలేదు. ఇక్కడ స్థానికులకు అస్తిత్వం అనే సమస్య ఉంది. దొంగలనే ముద్రా వేశారు. ఈ నేపథ్యంలో కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ చోర్ బజార్ కు వజ్రం చేరడం, దాని ద్వారా డ్రామా పుట్టడం ఇవన్నీ ఈ కథలో బలమైన అంశాలు. అయితే ఈ అంశాలను అన్నింటినీ కలిపి ఓ మెప్పించే కథను తెరపై ఆవిష్కరించలేకపోయారు దర్శకుడు జీవన్ రెడ్డి. ఎక్కువ పాత్రలను పెట్టి ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేశారు. ఏ పాత్రకూ సరైన ఆది, అంతం ఉండదు. హీరోయిన్ను మూగ అమ్మాయిగా చూపించడం కొత్తగా ఉంది. ఆమె కనిపించిన ప్రతిసారీ స్పీకర్ లో సినిమా డైలాగ్స్ పెట్టి నవ్వించింది. గెహనా సిప్పీ సిమ్రాన్ అనే పాత్రలా మారిపోయింది.
చోర్ బజార్ మనుషుల కథను, వ్యథను ఆకట్టుకునేలా, సిపంథీ క్రియేట్ అనేలా చెప్పలేకపోయాడు దర్శకుడు. వజ్రం కోసం రెండూ మూడు పార్టీలు వెతికే క్రమంలో పుట్టిన డ్రామా కొంత నవ్విస్తుంది. ఈ రెండు మూడు కామెడీ సీన్స్ వరకు వినోదాత్మకంగా సినిమా సాగుతుంది. ఆకాష్ ను హీరోగా ఎలివేట్ చేసేందుకు వీలైనంత ప్రయత్నం చేశారు. బచ్చన్ సాబ్ పాత్ర వరకు ఆకాష్ మెప్పిస్తాడు. అతని నటనలో, కనబర్చిన భావోద్వేగాల్లో ఎక్కడా లోపం లేదు. సీనియర్ నటి అర్చన తల్లి పాత్రలో ఆకట్టుకుంది. ఆమె పాత్రకున్న నేపథ్యం కూడా సహజంగా అనిపించింది. పాతికేళ్ల తర్వాత ఆమెను తెలుగు తెరపై చూపించారు. మాంజా పాత్రలో సంపూర్ణేష్ బాబుకు అవసరం లేని బిల్డప్ పెట్టారు. ఎడిటింగ్ కూడా ఈ చిత్రానికి లోపమే.
చోర్ బజార్ నేపథ్యం వల్ల సన్నివేశాల్లో హిందీ డైలాగ్స్ వాడారు. ఇవి బీ, సీ సెంటర్స్ ప్రేక్షకులకు నచ్చే అవకాశముంది. చివరలో ఐటెం సాంగ్ పెట్టడం మాస్ ను మెప్పించే ప్రయత్నమే. ఆకాష్ చేసిన యాక్షన్ సీక్వెన్సులు బాగున్నాయి.
రేటింగ్: 2.5/5.