HERO | ఇటీవల సీక్వెల్ చిత్రాల క్రేజ్ మాములుగా లేదు. ఒక సినిమా హిట్ అయిందంటే వెంటనే దానికి సీక్వెల్ ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ఏకంగా ఎనిమిది సీక్వెల్స్ సిద్ధం చేశాడు. ముందుగా చూస్తే.. 2019లో విడుదలైన హిట్ చిత్రం ‘దే దే ప్యార్ దే’కి సీక్వెల్ గా ‘దే దే ప్యార్ దే 2 చేస్తున్నాడు. అన్షుల్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్, ఆర్. మాధవన్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం 19 సెప్టెంబర్ 2025న విడుదల కానుంది. 2012లో వచ్చిన హిట్ చిత్రం ‘సన్ ఆఫ్ సర్ధార్’కి సీక్వెల్ గా సన్ ఆఫ్ సర్ధార్ 2 చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్‌తో పాటు సంజయ్ దత్, సునీల్ శెట్టి, మృణాల్ ఠాకూర్, జూహి చావ్లా, సంజయ్ మిశ్రా కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 15 ఆగస్టు 2025న విడుదల కానుంది.
ఇక 2007లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘ధమాల్’కి సీక్వెల్ గా ‘డబుల్ ధమాల్’ (2011), ‘టోటల్ ధమాల్’ (2019) ఇప్పటికే వచ్చాయి. ఇక ఇప్పుడు ‘ఫుల్ ఆన్ టోటల్ ధమాల్’ పేరుతో వస్తున్న నాల్గవ భాగం 2026లో విడుదల కానుంది. ఇందులో అజయ్ దేవగన్, అర్షద్ వార్సీ, జావేద్ జాఫ్రీ, రితేష్ దేశ్‌ముఖ్, సంజయ్ మిశ్రా, సంజీదా షేక్, అంజలి ఆనంద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక అజయ్ దేవగన్ దర్శకుడు రోహిత్ శెట్టి ‘గోల్మాల్’ ఫ్రాంచైజీ తో సందడి చేయనున్నారు. ఇప్పటికే నాలుగు భాగాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశాయి. ఇప్పుడు ఐదవ భాగం షూటింగ్‌ను రోహిత్ శెట్టి త్వరలోనే ప్రారంభించనున్నారు. మరో చిత్రం మిషన్ చుల్బుల్ సింగం. రోహిత్ శెట్టి క్రియేట్ చేసిన కాప్ యూనివర్స్ లో భాగంగా పలు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు నాల్గవ భాగం త్వరలో పట్టాలెక్కనుంది. ఇందులో అజయ్ దేవగన్‌తో పాటు సల్మాన్ ఖాన్ కూడా కనిపించనున్నారు.
దర్శకుడు రోహిత్ శెట్టి 2009లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఆల్ ది బెస్ట్ : ఫన్ బిగిన్స్’ సీక్వెల్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ‘శైతాన్’ 2011లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం. దీనికి సీక్వెల్‌గా వికాస్ బహల్ త్వరలోనే ‘శైతాన్ 2’ని ప్రకటించవచ్చని వార్తలు వచ్చాయి. 2015లో ‘దృశ్యం’, 2022లో ‘దృశ్యం 2’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత, అజయ్ దేవగన్ ‘దృశ్యం 3సపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఆగష్ట్‌లో మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. దీనికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.