Ahsaas Channa | ఎంతోమంది ఆర్టిస్టులు బాలనటులుగా బాలీవుడ్లో అడుగుపెట్టారు. సహజమైన నటనతో మెప్పించి.. సక్సెస్ కొట్టారు. అలా.. బాలనటుడిగా ఒక తరానికి గుర్తుండిపోయిన నటి.. అహ్సాస్ చన్నా! పరిశ్రమలోకి అబ్బాయిగా అడుగుపెట్టి.. ఇప్పుడు హీరోయిన్గా రాణిస్తున్నది. అయితే, బాల్యంలో తాను బలవంతంగానే బాలుడి పాత్రలు వేసినట్లు తాజాగా చెప్పుకొచ్చింది.
ముంబయిలోని పంజాబీ సిక్కు కుటుంబంలో జన్మించిన అహ్సాస్ చన్నా.. ఐదేళ్ల వయసులోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘వాస్తు శాస్త్రం’ చిత్రంలో సుస్మితాసేన్ కొడుకు ‘రోహన్’గా వెండితెరకు పరిచయమైంది. 2004లో విడుదలైన ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. 2006లో కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన హిట్ చిత్రం.. ‘కభీ అల్విదా నా కెహనా’లోనూ షారుఖ్ ఖాన్ – ప్రీతి జింటా కొడుకు ‘అర్జున్’ పాత్రలో ఒదిగిపోయింది.
ఈ సినిమా అహ్సాస్కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘మై ఫ్రెండ్ గణేశ్’ చిత్రంలో వినాయకుడి స్నేహితుడు ‘ఆశు’గా అలరించింది. ఇలా.. బాలనటిగా కంటే, బాల నటుడిగానే ప్రేక్షకులకు దగ్గరైంది అహ్సాస్ చన్నా. అయితే, తనకు ఏమాత్రం ఇష్టం లేకుండానే సినిమాల్లో అబ్బాయి పాత్రలు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది చన్నా! తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాలను వెల్లడించింది.
తమ కుటుంబ సంప్రదాయంలో భాగంగా.. చిన్నతనంలో ఆమెకు గుండు చేయించారట. అప్పుడే ‘వాస్తుశాస్త్రం’ ఆడిషన్స్ పాల్గొన్నది చన్నా. ఆమె నటనకు ఫిదా అయిన సినిమా బృందం.. బాలనటుడి పాత్రకు ఎంపిక చేసింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో.. చన్నాకు వరుస అవకాశాలు దక్కాయి. అయితే.. అవన్నీ అబ్బాయి పాత్రలే! దాంతో బాలీవుడ్ డిమాండ్ మేరకు.. తాను ఎప్పుడూ జుట్టు కత్తిరించుకొనే ఉండేదాన్ననీ, అబ్బాయిల్లానే డ్రెస్సింగ్ చేసుకునేదాన్ననీ వెల్లడించింది.
ఈ విధానం తనను మానసికంగా చాలా ప్రభావితం చేసిందనీ చెప్పుకొచ్చింది. “కభీ అల్విదా..’ తర్వాత అబ్బాయి పాత్రలు మానేద్దామని అనుకున్నా.. మంచి అవకాశాలు రావడంతో కొనసాగించక తప్పలేద’ని ఆమె వాపోయింది. ప్రస్తుతం హీరోయిన్గా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా మారిపోయిందీ భామ. ఇన్‌స్టాలోనూ అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గా పనిచేస్తున్నది.