సినీ నటులు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల డిసెంబర్ 4న వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియో వీరి పెళ్లికి వేదిక కానుంది. తమ రిలేషన్‌షిప్‌పై గత ఏడాది కాలంగా గోప్యత పాటించిన ఈ జంట ఆగస్ట్‌లో నిశ్చితార్థం జరుపుకొని అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్నిచ్చారు. అప్పుడే వీరి లవ్ ఎఫైర్ గురించి అందరికి తెలిసింది. ఇదిలా వుండగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శోభితా ధూళిపాళ్లతో తన పరిచయం, ఆమె కుటుంబ సభ్యులతో ఏర్పడిన అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు నాగచైతన్య. ముంబయిలో జరిగిన ఒక ఓటీటీ షో సందర్భంగా తామిద్దరం తొలిసారిగా కలుసుకున్నామని చైతూ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘మా ఇద్దరి పరిచయం అనుకోకుండా జరిగిపోయింది. ఫస్ట్ మీటింగ్‌లో చాలా సరదాగా మాట్లాడుకున్నాం. కొన్ని నెలల వ్యవధిలోనే మా మధ్య బంధం బలపడింది. ఆ తర్వాత మా ఇద్దరి ఫ్యామిలీస్ చాలా సార్లు కలిశాయి’ అని చెప్పారు నాగచైతన్య. శోభితా కుటుంబం సంప్రదాయాలకు చాలా ప్రాధాన్యతనిస్తుందని, తనను వారు ఓ కొడుకులా ట్రీట్ చేస్తారని నాగచైతన్య చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోతో తమ కుటుంబానికి భావోద్వేభరితమైన అనుబంధం ఉందని, అక్కడ పెళ్లి చేసుకోవడం చాలా ప్రత్యేకంగా భావిస్తున్నానని నాగచైతన్య తెలిపారు.