‘వరంగల్ పోరాటాలకు అడ్డా. వీరత్వానికి ఇంటిపేరు. ఇక్కడ ఈ వేడుక జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. కొత్త కథాంశంతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు తప్పకుండా విజయాన్ని అందిస్తారు. ఈ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందనుకుంటున్నా’ అన్నారు అగ్ర నటుడు అక్కినేని నాగార్జున. ఆదివారం వరంగల్‌లో జరిగిన ‘ఏజెంట్’ ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నగర మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అఖిల్ అక్కినేని కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘ఇదొక స్పై థ్రిల్లర్. ఈ కథ గురించి నాకు తెలియదు. కానీ అఖిల్ సినిమా గురించి చెబుతుంటే తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనిపించింది. ఓ బ్లాక్ బస్టర్ హిట్‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు’ అన్నారు. మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ ‘వరంగల్‌లో వేడుక జరుపుకునే ప్రతి సినిమా విజయం సాధిస్తుంది. వరంగల్ విజయాలకు అడ్డా. నాగార్జునగారిని వరంగల్‌లో స్టూడియో పెట్టాలని కోరుతున్నా’ అన్నారు. ఈ చిత్రం నటుడిగా తనకు ధైర్యాన్నిచ్చిందని, విజయంపై ధీమాగా ఉన్నామని హీరో అక్కినేని అఖిల్ చెప్పారు. దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం అఖిల్ ఎంతగానో శ్రమించాడు. అతనిలో ఏదో సాధించాలనే తపన కనిపించింది. అఖిల్ కోసమే ఈ సినిమా చేశా’ అన్నారు. ‘నాగార్జునతో సినిమా చేయాలన్నది మా కల. అది అఖిల్‌తో నెరవేరింది. ఈ వేడుకకు నాగార్జునగారు అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది’ అని నిర్మాత అనిల్ సుంకర చెప్పారు.