Mahesh Babu – Rajamouli Project | మహేశ్‌బాబు కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ 29’(వర్కింగ్ టైటిల్)కి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో ట్రజర్ హంట్ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమా కోసం మహేశ్‌బాబు పలు యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్నారు. రాజమౌళి ఆదేశానుసారం జపాన్‌లో కొన్ని రోజులపాటు ఆయన మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారట.
అలాగే ఆఫ్రికాలోని మసాయి-పిగ్మీస్ తెగల మధ్య ఆ ప్రాంతపు యుద్ధ విద్యలపై బేసిక్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్టు తెలుస్తున్నది. అంటే ఓ 20రోజుల పాటు మహేష్ ఆఫ్రికన్ తెగల మధ్య గడిపారన్నమాట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల ద్వితీయార్ధంలో ఆయన చైనా వెళ్తున్నారట. అక్కడ మార్షల్ ఆర్ట్స్‌కి చెందిన ప్రత్యేక నిపుణుల ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటారని సమాచారం. మొత్తంగా రాజమౌళి సినిమాకోసం మహేష్ చెమటలు కక్కిస్తున్నారని తెలుస్తున్నది.