Adolescence | ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన “అడాల్సెన్స్”(Adolescence) అనే బ్రిటీష్ వెబ్ సిరీస్‌పై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్‌పై బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్‌తో పాటు అలియా భట్ ప్రశంసలు కురిపించారు. తాజాగా ఇంగ్లాండ్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఈ సిరీస్ చూసి చిత్రయూనిట్‌ను పొగడ్తల్లో ముంచెత్తాడు. అయితే ఇంతలా ఆదరిస్తున్న ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుంటే.. ప్రస్తుతం టీనేజీ యువత ఎదుర్కోంటున్న అతిపెద్ద సమస్యను ఈ సిరీస్‌లో చూపించారు మేకర్స్.
13 నుంచి 19 ఏండ్ల వరకు ఉన్న పిల్లలను టీనేజ్ లేదా అడాలసెన్స్‌గా పరిగణిస్తారు. ఈ వయసులోనే పిల్లల శరిరంతో పాటు మనసు, ఆలోచనలలో చాలా మార్పులు వస్తాయి. అయితే ఈ మార్పులను తల్లిదండ్రులను పట్టించుకోకపోవడంతో పిల్లలు ఎక్కువగా కన్ఫ్యూషన్‌కి గురవుతుంటారు. దీని గురించి అటు పేరెంట్స్ కానీ.. టీచర్స్ కానీ వివరించే వారు ఉండరు. అయితే ప్రస్తుతం పిల్లలు అనుభవిస్తున్న ఈ సమస్యపైనే అడాలసెన్స్ వెబ్ సిరీస్ వచ్చింది.
కథలోకి వెళితే.. ఈ సిరీస్ 13 ఏళ్ల బాలుడు జమీ చుట్టూ తిరుగుతుంది. కేటీ అనే బాలిక స్కూల్ పరిసరాల్లో దారుణ హత్యకు గురవడంతో.. ఈ నేరం కింద జమీని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అనంతరం అతడు హత్య చేయడానికి గల కారణాన్ని విచారిస్తారు పోలీసులు. అయితే ఈ విచారణలో జమీ హత్య చేశాడా.. ఈ హత్య అతని జీవితాన్ని, అతని చుట్టూ ఉన్నవారి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనేది ఈ కథలోని ముఖ్యాంశం. మొత్తం మూడు ఎపిసోడ్లుగా విడుదలైన ఈ చిత్రం ఒక్కొక్కటి గంట నిడివిని కలిగి ఉంది. అలాగే రియాలీటికి దగ్గరగా ఉండాలని ప్రతి ఎపిసోడ్‌ను సింగిల్ షాట్లో చిత్రీకరించారు మేకర్స్. మొదటి ఎపిసోడ్ పోలీస్ స్టేషన్లో జరుగగా.. రెండోది స్కూల్ వాతావరణంలో. మూడోది జైలు నేపథ్యంలో సాగుతుంది. ఈ మూడు వేర్వేరు ప్రదేశాలు జమీ జీవితంలోని విభిన్న కోణాలను, అతని మానసిక పరిణామాన్ని చూపిస్తాయి.
ముఖ్యంగా జమీకి ఒక సైకాలజిస్ట్ మధ్య జరిగే సంభాషణలు చాలా కీలకం. ఈ సంభాషణల ద్వారా ప్రస్తుతం టీనేజ్ యువత సోషల్ మీడియాతో ఎలా ప్రభావితం అవుతుంది. ఆన్లైన్ వలన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలి అనుకుంటున్నా తల్లిదండ్రులు అసలు పిల్లలకి ఏం కావాలి అనేది పట్టించుకోకుండా నిత్యం పనిలో బిజీగా ఉండడం కళ్లకు కనిపించేలా చిత్రీకరించారు మేకర్స్. ఈ సిరీస్‌ను పిల్లలతో పాటు తల్లిదండ్రులు, ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు చూడాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.