అడవి శేష్ ‘డెకాయిట్’ గ్లింప్స్ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేటయ్యేలా చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 25న ‘డెకాయిట్’ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు కూడా. ఇదిలావుండగా.. కథానాయిక మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాకు సంబంధించి చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. తన నుదుటికు తగిలిన గాయాన్ని చూపిస్తూ ‘సబ్కా బద్లా లేగీ జూలియట్’ అంటూ పోస్ట్ చేశారు మృణాళ్. ఈ ఫొటోలో తన పక్క అడవి శేష్ కూడా ఉండటం గమనార్హం. ‘అందరిపై ప్రతీకారం తీర్చుకుంటా’ అనేది ఈ పోస్ట్‌కు తెలుగర్థం.
ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌లో మృణాళ్ ఠాకూర్‌ని అడవి శేష్ ‘జూలియట్..’ అని సంబోధించిన విషయం తెలిసిందే. పైగా ఇది ఓ బ్రేకప్ ప్రేమజంట మధ్య నడిచే ప్రతీకార కథ అని ఈ సినిమా టీజర్ ఇప్పటికే చెప్పేసింది. ఈ నేపథ్యంలో మృణాళ్ చేసిన ఈ పోస్ట్ సినిమాపై ఇంకొంచెం హైప్‌ని పెంచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. షనీల్‌డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. అనురాగ్ కశ్యప్, ప్రకాశ్‌రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, కామాక్షి భాస్కర్ల ఇతర తారాగణం.