సినీ తారలు సిద్ధార్థ్, అదితిరావు హైదరీ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో సోమవారం ఈ జంట వివాహం నిరాడంబరంగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్, అదితిరావు హైదరీ పెళ్లిపీటలెక్కారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను అదితిరావు హైదరీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. ‘నువ్వే నా సూర్యుడివి, చంద్రుడివి.. నువ్వే నా తారాలోకం.. మన ప్రేమబంధం శాశ్వతంగా నిలిచిపోయి నవ్యకాంతుల్ని వర్షిస్తుంది. మిసెస్ అండ్ మిస్టర్ అదు-సిద్ధు’ అంటూ ఫొటోలకు క్యాప్షన్‌ను జతచేసింది.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు సినీ తారలతో పాటు అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలందజేశారు. ఈ ఏడాది మార్చిలో సిద్ధార్థ్, అదితిరావు హైదరీ నిశ్చితార్థం జరుపుకున్నారు. ‘మహా సముద్రం’ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. అదితిరావు హైదరీ తల్లిదండ్రులిద్దరూ రాజకుటుంబాలకు చెందిన వారు.
అదితిరావు తల్లి విద్యారావు వనపర్తి సంస్థానానికి చెందిన జానంపల్లి రామేశ్వరరావు కుమార్తె. దాంతో వనపర్తి సంస్థానానికి వారసురాలిగా అదితిరావుకు గుర్తింపు ఉంది. అలాగే వనపర్తి జిల్లా రంగనాథ స్వామి ఆలయంతో అదితిరావు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. తమ కుటుంబంలో ఎలాంటి శుభకార్యాన్నైనా ఆ ఆలయంలోనే నిర్వహిస్తామని అదితిరావు హైదరీ పలు సందర్భాల్లో చెప్పింది. తన కుటుంబ మూలాలు, వారసత్వాన్ని గౌరవిస్తూ వివాహాన్ని కూడా అదే ఆలయంలో జరుపుకుంది.