ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ఇతిహాసిక నేపథ్య చిత్రం ఆదిపురుష్. కృతి సనన్ సీత పాత్రను పోషిస్తున్నది. ఈ సినిమా జూన్ 16న విడుదలకు సిద్ధమవుతున్నది. సినిమా ప్రచారంలో కీలకమైన ట్రైలర్ విడుదల కోసం చిత్రబృందం భారీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల రెండో వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్స్‌లో 2డీ, త్రీడీ వెర్షన్స్‌లో ప్రదర్శించబోతున్నారు. ఈ ప్రదర్శనలకు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని ఆశిస్తున్నారు.
ఈ చిత్ర రూపకల్పనలో ఉపయోగించిన సాంకేతికత, గ్రాఫిక్స్ నాణ్యత తెలియాలంటే పెద్ద తెరలపైనే ప్రదర్శించాలని చిత్రబృందం భావిస్తున్నారు. గతంలో టీజర్ విడుదలైనప్పుడు సీజీ నాణ్యతపైన విమర్శలు వచ్చిన నేపథ్యంలో మరోసారి అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరుపతి, భద్రాచలంలో రెండు భారీ ఈవెంట్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారట. ఈ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రో ఫైల్స్ పతాకాలపై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఐమ్యాక్స్ వెర్షన్లోనూ ఈ సినిమా విడుదలకానుంది.