Tamannaah in Jailer Movie | మంచు మనోజ్ హీరోగా నటించిన ‘శ్రీ’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా. ‘హ్యాపీడేస్’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ వంటి వరుస విజయాలతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా నిలిచింది. సౌత్ టు నార్త్ వరకు స్టార్ హీరోలందరితో తమన్నా జోడీ కట్టింది. దాదాపు 15ఏళ్ళకు పైగా చిత్రసీమలో ఉంటూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టి పడేస్తూ వస్తుంది. నవతరం హీరోయిన్లకు పోటీగా సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ప్రస్తుతం తమన్నా చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. అందులో ఐదు చిత్రాలు షూటింగ్‌లను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా తమన్నాకు ఓ భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.
తమన్నాకు సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో నటించే ఛాన్స్ వచ్చిందని సమాచారం. ప్రస్తుతం రజినీకాంత్ ‘జైలర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘డాక్టర్’, ‘బీస్ట్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టైటిల్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రజినీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. కాగా ఒక పాత్రకు హీరోయిన్గా రమ్యకృష్ణ నటించగా.. రెండో పాత్ర కోసం తమన్నాను ఎంపికచేశారట. ఇప్పటికే కథా చర్చలు ముగిసాయని, తమన్నా కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే చిత్రబృందం నుండి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం తమన్నా నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో పాటుగా చిరంజీవి ‘భోళా శంకర్’లో హీరోయిన్గా నటిస్తుంది.