సోనాలీ బింద్రే..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన తార. అప్పట్లో టాలీవుడ్లో అగ్రతారగా వెలిగింది. మన స్టార్ హీరోలతో ఆడిపాడింది. ఆమె నటించిన ‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ ఘన విజయాలు సాధించాయి. కొన్నాళ్లకు బాలీవుడ్ వెళ్లిపోయిన సోనాలీ…మళ్లీ తెలుగు తెరకు వస్తున్నట్లు సమాచారం. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సోనాలీ తెలుగు సినిమాలో నటించబోతున్నది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో ఓ కీలక పాత్రకు సోనాలీని సంప్రదిస్తున్నారట. ఈ కథలో ముఖ్యమైన పాత్రలో సోనాలీ బింద్రే కనిపిస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అన్నీ కుదిరితే ఎన్టీఆర్ చిత్రంతో సోనాలీ మళ్లీ మన ముందుకొచ్చే అవకాశముంది. బాలీవుడ్లో కెరీర్ సాగించిన సోనాలీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. కేన్సర్‌తో పోరాడి గెలిచింది. అప్పటి నుంచి ఎక్కువ సమయాన్ని కుటుంబ జీవితానికే కేటాయిస్తున్నది. ఆమె ప్రస్తుతం డాన్స్ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది.