Ruchi Gujjar | ముంబైలోని ఓ థియేటర్ వద్ద యాక్ట్రెస్ రుచి గుజ్జర్.. బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ మాన్ సింగ్‌ను చెప్పుతో కొట్టడం ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ యాక్టర్, నిర్మాత, దర్శకుడు మాన్ సింగ్ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘సో లాంగ్ వ్యాలీ’. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా జూలై 25న ముంబైలోని సినీపోలిస్ థియేటర్ వద్ద మాన్ సింగ్ చిత్ర యూనిట్‌తో పాటు హాజరయ్యారు. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన హీరోయిన్ రుచి గుజ్జర్ ఆయనపై చెప్పుతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా, “తనకు మాన్ సింగ్ ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదని” బహిరంగంగా ఆరోపించారు.
రుచి గుజ్జర్ మాట్లాడుతూ.. మాన్ సింగ్ నాకు రూ.25 లక్షలు ఇవ్వాలి. చాలా రోజులుగా అడుగుతున్నా, నిర్లక్ష్యం చేస్తున్నారు. చివరికి ఇలా బహిరంగంగా ఎదుర్కొనాల్సి వచ్చింది అని చెప్పారు. చిత్ర నిర్మాతలు గాడిదలపై కూర్చుని ఉన్నట్లు చిత్రీకరించిన కొన్ని ప్లకార్డులను ఆమె ప్రదర్శించి కాస్త హడావిడి చేసింది. ప్రస్తుతం. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే గతంలో మ్యూజిక్ ఆల్బమ్‌లకు సంబంధించి తనకు రావాల్సిన రెమ్యునరేషన్ కోసం ఆమె ఇలా హడావిడి చేసినట్లు తెలుస్తోంది. మాన్ సింగ్ పై దాడి చేసే సమయంలో నిర్మాత కరణ్ ఆయనకు మద్దతుగా నిలిచారు. అక్కడే ఉన్న మూవీ టీం సభ్యులు రుచిని అడ్డగించి అక్కడి నుంచి తీసుకెళ్లారు.
రుచి గుజ్జర్ ప్రముఖ మోడల్, యాక్ట్రెస్. మ్యూజిక్ వీడియోలు, వెబ్ కంటెంట్ ద్వారా బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. 2023లో మిస్ హర్యానా టైటిల్ గెలుచుకున్నారు. ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రధాని మోదీ ఫోటోతో కూడిన నెక్లెస్ ధరించి అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు నిర్మాతపై చెప్పుతో దాడి చేసి మళ్లీ వివాదాల్లోకి వచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యాక్టర్స్, క్రిటిక్స్, ప్రేక్షకులు ఈ ఘటనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రుచి చేసిన పనిని కొంతమంది సపోర్ట్ చేస్తున్నా, మరికొంతమంది ఈ విధానాన్ని తప్పుబడుతున్నారు.