Actress Rambha | ముప్పై ఏళ్ళ క్రితం ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది రంభ. తొలి సినిమానే రంభకు తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సూపర్ కృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఇలా స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. 90వ దశకంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళ, కన్నడ, భోజ్‌పూరి, బెంగాలి భాషల్లోనూ సినిమాలు చేసింది. ఇక 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ను పెళ్లిచేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. రంభకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు.
సినిమాలకు గుడ్‌బై చెప్పినా.. రంభ సోషల్ మీడియాలో తరచూ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ఆ మధ్య పిల్లలను స్కూల్ నుంచి తీసుకొస్తుండుగా తన కారు ప్రమాదానికి గురైందని సోషల్ మీడియాలో వెల్లడించింది. స్వల్ప గాయాల నుంచి కోలుకున్న తర్వాత అభిమానులకు థ్యాంక్స్ అని కూడా చెప్పింది. ఇలా ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో పలు విషయాలు పంచుకునే రంభ తాజాగా తన పెద్ద కూతురు లాన్య ఇంద్రకుమార్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
తెలుగు అమ్మాయిలా ముస్తాబయిన లాన్య ఫోటోలను రంభ అభిమానులతో పంచుకుంది. దాంతో పలువురు నెటీజన్లు అచ్చం మీ లాగే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. చివరిగా రంభ ‘దొంగ సచ్చినోల్లు’ అనే సినిమాలో కనిపించింది. ఇక రంభ కేవలం నటిగానే కాకుండా స్పెషల్ సాంగ్స్‌లో కూడా మెప్పించింది. ‘కన్నె పెట్టరో’, ‘చలిగాలి ఝమ్మంది’, ‘హే రుక్కుమాన్’, ‘రామయ్య పడ్డలేటి’, ‘అట్టాంటోడే ఇట్టాంటోడే’, ‘నాచోరే నాచోరే’ వంటి ఐటెం పాటలతోనూ ప్రేక్షకులను అలరించింది.