‘గ్యాంగ్‌లీడర్’, ‘శ్రీకారం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న నాయిక ప్రియాంక అరుల్ మోహన్. ఆమె హీరో సూర్య సరసన నటించిన కొత్త సినిమా ‘ఈటీ’ (ఎవరికీ తలవంచడు). సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మాణంలో దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించారు. ఏషియన్ మల్టీప్లెక్స్ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నది. మార్చి 10న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్రంలో తన క్యారెక్టర్ విశేషాలు తెలిపింది ప్రియాంక. ఆమె మాట్లాడుతూ…‘ఒక మంచి కుటుంబ కథా చిత్రంలో భాగమయ్యాను. ఈ చిత్రంలో నా పాత్ర అర్థవంతంగా ఉంటుంది. సినిమా తొలిభాగంలో సరదాగా ఉంటూ, ద్వితీయార్థంకు కథలో కీలకంగా వ్యవహరిస్తుంది. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు నా పాత్రలోనూ ఉంటాయి. ఈ క్యారెక్టర్ వినగానే నటించడం ఒక బాధ్యతగా భావించాను. సూర్యతో సమానంగా కనిపించే పాత్ర నాది. నాయికలకు ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. సూర్య సామాజిక దృక్పథం ఉన్న నటుడు. ఆయనతో నటించడం సంతోషంగా ఉంది. తమిళంలో ఓ కొత్త చిత్రంలో నటిస్తున్నా.’ అని చెప్పింది.