‘రొమాంటిక్’ ‘లక్ష్య’ చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకుంది కేతికాశర్మ. ఆమె వైష్ణవ్‌తేజ్ సరసన కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. గిరీశాయ దర్శకుడు. సెప్టెంబర్ 2న విడుదలకానుంది. ఈ సందర్భంగా కేతికాశర్మ పాత్రికేయులతో ముచ్చటించింది. ఆ విశేషాలు..
‘ఈ సినిమాలో నేను డాక్టర్ రాధా పాత్రలో కనిపిస్తా. చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూనే కుటుంబ అనుబంధాలకు ప్రాధాన్యతనిచ్చే అమ్మాయిగా నా పాత్ర భిన్న కోణాల్లో ్ల సాగుతుంది. పక్కింటి అమ్మాయి తరహాలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. మా పేరెంట్స్ నన్ను డాక్టర్‌గా చూడాలనుకున్నారు. తెరపై ఆ పాత్రను పోషించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. రాధా పాత్ర ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ అలాంటి అమ్మాయి తమ ఇంట్లో ఉంటే బాగుంటుందని కోరుకుంటారు.
విమర్శల్ని పట్టించుకోను
సోషల్‌మీడియా అంటేనే పొగడ్తలతో పాటు విమర్శలుంటాయి. అందుకే వాటి గురించి నేనస్సలు పట్టించుకోను. కానీ ఎవరైన నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తే మాత్రం స్వీకరిస్తాను. అంతిమంగా ప్రేక్షకుల్ని మెప్పించడమే నా కర్తవ్యంగా భావిస్తా. కథ నచ్చితే ఏ జోనర్ సినిమాలోనైనా నటించడానికి సిద్ధమే. ఓటీటీల మీద అంతగా ఆసక్తి లేదు. ప్రస్తుతం సినిమాల మీదనే దృష్టిపెడుతున్నా. సమాజానికి స్ఫూర్తినిచ్చే బయోపిక్ చిత్రాల్లో నటించాలన్నది నా కల. తెలుగులో కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఆ వివరాల్ని త్వరలో వెల్లడిస్తా.