Tovino Thomas | మలయాళ నటుడు టోవినో థామస్ ‘నడిగర్ తిలకం’ సినిమా షూటింగ్లో గాయపడ్డాడు. ‘డ్రైవింగ్ లైసెన్స్’ దర్శకుడు లాల్ జూనియర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పెరంబవూరు సమీపంలోని మారంపల్లిలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షూటింగ్లో ప్రమాదవశాత్తు టోవినో థామస్ రెండు కాళ్లకు గాయాలయ్యాయి. చిత్ర యూనిట్ వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అయితే మేజర్‌గా గాయాలు కాలేవని, ఓ వారం వరకు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ చెప్పాడట. ఇక వారం తర్వాతే సినిమా షూటింగ్ మళ్లీ మొదలు కానుందని దర్శకుడు చెప్పాడు.
రెండేళ్ల కిందట వచ్చిన మిన్నల్ మురళీ సినిమాతో టోవినో థామస్‌కు తెలుగులో మంచి పాపులారిటీ వచ్చింది. అప్పటి నుండి ఆయన సినిమాలను తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆధరిస్తున్నారు. ఇటీవలే రిలీజైన 2018 సినిమా కూడా తెలుగులో భీభత్సమైన కలెక్షన్లు సాధించి.. టోవినో థామస్‌కు మంచి మార్కెట్‌కు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆయన నటించిన ఏఆర్ఎమ్ విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులోనూ ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇక లాల్ జూనియర్ తెరకెక్కిస్తున్న ‘నడిగర్ తిలకం’ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుంది. పైగా డ్రైవింగ్ లైసెన్స్ వంటి బంపర్ హిట్ తర్వాత లాల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో సినీ ప్రియుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. షోబిన్ షాహీర్, షైన్ టామ్ చాకోలు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ కానుంది.