TNR | టీఎన్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోల్డ్ మ్యాన్ రాజా (టి. నరసింహారెడ్డి – టీఎన్ఆర్) నిర్మించి, నటించిన ‘మిస్టర్ రెడ్డి’ చిత్ర థియేటర్లలో విడుదలైంది. వెంకట్ వోలాద్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టీఎన్ఆర్‌తో పాటు మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి శ్రీరంగం కీలక పాత్రలు పోషించారు. ఒక సామాన్య వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, బంధాలు, మోసాలు, విజయాలను ఆవిష్కరించే స్ఫూర్తిదాయకమైన కథ ఇది. మరి ఈ ‘మిస్టర్ రెడ్డి’ ఆడియెన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ
మిస్టర్ రెడ్డి (టీఎన్ఆర్) చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడంతో, కుటుంబ బాధ్యతలు అతని భుజాలపై పడతాయి. చదువును పక్కన పెట్టి కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతాడు. ఊరి ప్రెసిడెంట్ కూతురు వెన్నెల (అనుపమ)తో అతని ప్రేమ అనుకోని కారణాలతో దూరం అవుతుంది. ఆ తర్వాత సిటీకి వచ్చిన టీఎన్ఆర్, చిన్న చిన్న సెటిల్మెంట్ల నుంచి ‘రెడ్డి కన్స్ట్రక్షన్’ పేరుతో కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు. అయితే, ధనం పుష్కలంగా ఉన్నా, అతని జీవితంలో ఏదో ఒక లోటు, ఒంటరితనం వెంటాడుతుంటాయి. అలాంటి టీఎన్ఆర్ జీవితంలోకి కీర్తన (దీప్తి) వస్తుంది. ఆమె రాకతో టీఎన్ఆర్ జీవితం ఎలా మారుతుంది? స్నేహితుల మోసం అతన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? చివరికి మిస్టర్ రెడ్డి నిజమైన సంతోషాన్ని కనుగొంటాడా? అన్నదే ఈ సినిమా కథాంశం.
విశ్లేషణ
నిర్మాత టీఎన్ఆర్ తన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించడం విశేషం. తన జీవిత ప్రయాణాన్ని వెండితెరపై ఆవిష్కరించాలనే ఆయన తపన సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. ‘మిస్టర్ రెడ్డి’ చిత్రం ప్రతి సామాన్యుడికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. కష్టపడి ఎదిగిన తీరు, ఆర్థిక విజయం సాధించినా అనుబంధాల కోసం పడే తపన, బాల్య మిత్రులు, ప్రేమ వైఫల్యాలు, నమ్మిన వాళ్లే మోసం చేయడం వంటివి చాలా మంది జీవితాల్లో కనిపించే అంశాలే.
మొదటి భాగం టీఎన్ఆర్ ఎదుగుదల, కీర్తనతో అతని పరిచయం, ప్రేమ సన్నివేశాలతో సాగుతుంది. గతానికి, వర్తమానానికి మధ్య సమాంతరంగా సాగే స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ ముందు టీఎన్ఆర్కు జరిగే ప్రమాదంతో ప్రథమార్థం ముగిసి, ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతుంది. రెండో భాగంలో టీఎన్ఆర్ గతం గురించి మరింత లోతుగా తెలుసుకుంటాం. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు కొంతవరకు ఊహించిన విధంగానే ఉంటాయి.
సాంకేతిక, నటన విభాగం
సాంకేతికంగా ఈ చిత్రం మెప్పిస్తుంది. విజువల్స్ చాలా సహజంగా ఉన్నాయి, గ్రామీణ వాతావరణాన్ని చక్కగా చూపించారు. సంగీతం ఆహ్లాదకరంగా ఉంది, ముఖ్యంగా ప్రేమ పాట బాగుంది. ఎడిటింగ్ సినిమాకు ప్రధాన బలం, తక్కువ నిడివి ప్రేక్షకుడికి కలిసొచ్చే అంశం. నిర్మాతగా టీఎన్ఆర్ ఎక్కడా రాజీ పడకుండా భారీ నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించారని స్పష్టంగా తెలుస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే, టీఎన్ఆర్ తన వయసుకు తగ్గ పాత్రలో ఒదిగిపోయారు. యువ రెడ్డి పాత్రలో మహాదేవ్ చక్కగా నటించారు. హీరోయిన్లు దీప్తి మరియు అనుపమ తమ పాత్రలకు న్యాయం చేస్తూ, లుక్స్ పరంగా, నటన పరంగా ఆకట్టుకుంటారు. మిగిలిన సహాయ నటులు భాస్కర్, స్నేహితులు, గ్యాంగ్ సభ్యులు తమ తమ పాత్రల్లో బాగా రాణించారు.
రేటింగ్: 2.75/5