Ustad Bhagath Singh Movie | పదేళ్ల కిందట వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. నాలుగేళ్లుగా ఆకలి మీదున్న పవన్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఏకంగా ధమ్ బిర్యానీయే పెట్టింది. ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయితే.. తన అభిమాన హీరోను తెరపై ఎలా చూపిస్తాడో అనే దానికి ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇక ఇప్పుడు అదే కాంబోలో రెండో సినిమా తెరకెక్కుతుందంటే పవన్ అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లోనే ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఏడాది కిందట ‘భవదీయుడు భగత్ సింగ్’ అంటూ బైక్‌పై కళ్యాణ్ ఉన్న ఫోటోను రిలీజ్ చేసి వీళ్ల కాంబోలో రెండో సినిమా తెరకెక్కుతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటన వచ్చింది.
అయితే కొన్ని నెలల తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై ఉలుకూ, పలుకూ లేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా? లేదా? అనే క్లారిటీ కూడా లేదు. దాంతో సోషల్ మీడియాలో ఆ ప్రాజెక్ట్ కాన్సిల్ అయిందని వార్తలు వచ్చాయి. కాగా గతేడాది చివరి నెలలో పేరు మార్చి మళ్లీ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి వీళ్ల కాంబో కాన్సిల్ కాలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక పవన్‌కు వీలైనప్పుడల్లా షూటింగ్లో పాల్గొంటూ తన సీన్స్‌ను కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌కు వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో విలన్‌గా తమిళ నటుడు, దర్శకుడు ఆర్. పార్థీబన్‌ను తీసుకోబోతున్నారట.
ఆర్.పాబవన్.. ఈ పేరు వెంటనే స్ట్రయిక్ కాదేమో కానీ.. యుగానికొక్కడు సినిమాలో చోళరాజు అనగానే టపీమని గుర్తుకు వస్తుంది. ఇంకా చెప్పాలంటే రచ్చ ఫ్లాష్ బ్యాక్‌లో రామ్‌చరణ్ ఫాదర్‌గా చేసిన సూర్యనారాయణే ఈయన. మూడు దశాబ్దాల నట అనుభవం కలిగిన ఆయన తెలుగులో నేరుగా చేసింది ఒక్క సినిమానే. ఇక ఇప్పుడు మళ్లీ ఉస్తాద్‌తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుంది. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి స్వరాలు అందిస్తున్నాడు.