Hema committee report | మలయాళ నటి పార్వతి తిరువోతు(Parvathy Thiruvothu) కేరళ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపులపై సుమారు ఐదున్నర సంవత్సరాల క్రితం సమర్పించిన హేమ కమిటీ నివేదికను అమలు చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఆమె మండిపడ్డారు.
2017లో ఒక మలయాళ నటిపై దాడి జరిగిన తర్వాత, సినీ పరిశ్రమలో మహిళల పని పరిస్థితులు, భద్రతను పరిశీలించడానికి కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ అధ్యక్షతన ఈ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ 2019లో తమ నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ రిపోర్ట్‌లో లైంగిక వేధింపులు, వివక్ష, సరైన సౌకర్యాల లేమి వంటి అనేక ముఖ్యమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
అయితే, ఈ నివేదిక ఇచ్చినప్పటి నుంచి ప్రభుత్వం దాన్ని అమలు చేయడంలో పెద్దగా చొరవ చూపడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో విసుగుచెందిన నటి పార్వతి తిరువోతు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ట్యాగ్ చేస్తూ పరోక్షంగా విమర్శలు గుప్పించింది. “హేమ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారో ఇప్పుడయిన గుర్తించుకుందామా? చిత్ర పరిశ్రమలో నియమ నిబంధనలు, విధానాలు రూపొందించడానికి కదా? మరి అవి ఏమయ్యాయి? తొందర ఏమీ లేదా? నివేదిక సమర్పించి ఐదున్నర సంవత్సరాలు మాత్రమే అయ్యింది కదా! అని ఆమె వ్యంగ్యంగా ప్రశ్నించింది. అయితే దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.
హేమ కమిటీ నివేదిక ఆధారంగా నమోదైన కొన్ని కేసులను పోలీసులు మూసివేయడానికి సిద్ధమవుతున్నారనే వార్తల నేపథ్యంలో పార్వతి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరోవైపు పార్వతి తిరువోతుతో పాటు “ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC)” వంటి సంస్థలు హేమ కమిటీ నివేదికను పూర్తిగా అమలు చేయాలని, సినీ పరిశ్రమలో మహిళల రక్షణకు కఠినమైన విధానాలు తీసుకురావాలని నిరంతరం డిమాండ్ చేస్తున్నాయి.