Actor Ajith | టాలీవుడ్ సినీ నటుడు అజిత్ తన పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే పద్మభూషణ్ అవార్డు అందుకున్న ఈ నటుడు సినీ పరిశ్రమలో 33 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయాల్లోకి వస్తున్న సినీ కళాకారులందరికీ తన శుభాకాంక్షలు ఉంటాయని అజిత్ తెలిపారు. అయితే, వ్యక్తిగతంగా తనకు రాజకీయాల్లో పాల్గొనే ఉద్దేశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. రాజకీయాల్లో మార్పు తీసుకురాగలమనే విశ్వాసంతో అడుగులు వేస్తున్న వారందరూ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అదే సమయంలో, తన స్నేహితుడు ప్రముఖ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీని సాహసోపేతమైన చర్యగా అజిత్ అభివర్ణించారు.
140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో వివిధ మతాలు, జాతులు, భాషలు కలిగిన ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారని అజిత్ కొనియాడారు. ఇంతటి వైవిధ్యాన్ని కలిగి ఉన్న దేశాన్ని ఏకతాటిపై నడిపించడం రాజకీయ నాయకులకే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. తాను ఇటీవల రాష్ట్రపతి భవన్‌ను సందర్శించినప్పుడు అక్కడి నియమాలు, భద్రతా ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయానని అజిత్ వెల్లడించారు. దేశ నాయకులు తమ జీవితాలను ఎలా గడుపుతున్నారో అప్పుడే తనకు అర్థమైందని ఆయన చెప్పారు. ఆ నాయకులను చూసి తాను అసూయపడటం లేదని, ఒక దేశాన్ని లేదా రాష్ట్రాన్ని బాధ్యతగా నడిపించడం చాలా కష్టమైన పని అని తాను గ్రహించానని ఆయన అన్నారు. అందుకే నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం ధైర్యమైన నిర్ణయమని ఆయన మరోసారి నొక్కి చెప్పారు.