Abhinav Shukla | గత కొద్ది రోజులుగా బిష్ణోయ్ గ్యాంగ్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ని బెదిరిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.వరుస బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తన సెక్యూరిటీని కూడా పెంచుకున్నారు. ఇక తాజాగా బిష్ణోయ్ గ్యాండ్ నుండి బాలీవుడ్ నటుడు అభినవ్ శుక్లాకి హత్యా బెదిరింపులు వస్తున్నాయట. ఈ విషయాన్ని అభినవ్ శుక్లానే తన ఎక్స్ ద్వారా తెలియజేశాడు. అంతేకాదు ఈ బెదిరింపులకు కారణమైన అనుమానితుడి వివరాలను ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులకి విజ్ఞప్తి చేస్తూ తాను చేసిన పోస్టును పంజాబ్, చండీగఢ్ పోలీసులకు ట్యాగ్ చేశారు.
అభినవ్ శుక్లా ఎక్స్ పోస్ట్ ప్రకారం చూస్తే.. అతడి సోషల్ మీడియా ఖాతాకు ఒక వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. అందులో నేను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిని. నాకు మీ ఇంటి అడ్రెస్ తెలుసు. ఈ మధ్య సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపినట్టే మీ ఇంటిపై కూడా జరుపుతాము. అసిమ్ గురించి గౌరవంగా మాట్లాడు. లేదంటే బిష్ణోయ్ గ్యాంగ్ జాబితాలో మీ పేరు కూడా చేరుతుంది అని ఉంది. తనతోపాటు తన కుటుంబ సభ్యులకు, భద్రతా సిబ్బందికి కూడా ఇదే మాదిరి బెదిరింపులు వచ్చాయని, ఆ సందేశం పంపిన వ్యక్తి ఇన్స్టాగ్రామ్ వివరాలను ఇవే అంటూ అభినవ్ తన ఎక్స్ పోస్టులో తెలియజేశారు.
ఇటీవల అభినవ్ శుక్లా భార్య రుబినా, బిగ్‌బాస్ ఫేమ్ అసిమ్ రియాజ్ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాదం బాగా ముదరడంతో అభినవ్ ..అసిమ్‌పై కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీని నేపథ్యంలో అసిమ్ అభిమానులు అభినవ్‌ను టార్గెట్ చేస్తూ గత కొద్ది రోజులుగా బెదిరిస్తున్నారు. తాజాగా వచ్చిన బెదిరింపు సందేశం కూడా అసిమ్ అభిమానులే పంపినదిగా అభినవ్ ఆరోపించారు. కాకపోతే బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో సందేశం రావడంతో అభినవ్ కాస్త టెన్షన్లో ఉన్నట్టు తెలుస్తుంది.