అన్పావం పొల్లాతతు
జియో హాట్‌స్టార్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: రియో రాజ్, మాళవికా మనోజ్, షీలా రాజ్‌కుమార్, దీపా శంకర్, అనుపమ కుమార్, ఆర్జె. విఘ్నేశ్‌కాంత్ తదితరులు
దర్శకత్వం: కలైయరసన్ తంగవేల్ పెళ్లిళ్లు-పెటాకుల కథాంశంతో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. భార్యభర్తల గొడవలు, విడాకులు.. దర్శకనిర్మాతలకు కాసులు కురిపించాయి. అయితే, నిన్నమొన్నటి జంటల కథలు వేరు. వారి గొడవలు వేరు. కానీ, జెన్-జీ తరంలో.. సర్దుకుపోవడాలు తగ్గిపోయాయి. కోర్టులు-విడాకులు ఎక్కువయ్యాయి. పట్టుమని పదిరోజులు కూడా కలిసి ఉండకుండా.. చిన్నచిన్న కారణాలతోనే కోర్టు మెట్లు ఎక్కుతున్న జంటలెన్నో!
అలా.. పంతాలకు పోయి సంసారాన్ని పాడుచేసుకుంటున్న నేటితరం దంపతులకు ఓ సందేశాన్ని ఇస్తుంది.. అన్ పావం పొల్లాతతు చిత్రం. అక్టోబర్‌లో థియేటర్లకు వచ్చిన ఈ తమిళ చిత్రం.. మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా, జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. రికార్డ్ వ్యూస్ కొల్లగొడుతున్నది. కథలోకి వెళ్తే.. శివ (రియో రాజ్)ది మధ్యతరగతి కుటుంబం. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ.. తల్లి, తండ్రి, తమ్ముడితో కలిసి ఉంటాడు. ఇక శక్తి (మాళవిక మనోజ్).. తండ్రి ఆంక్షల మధ్య పెరుగుతుంది.
ఏ విషయంలోనూ తనకు స్వేచ్ఛలేదని బాధపడుతుంటుందామె. పెద్దలు కుదిర్చిన వివాహంతో శివ-శక్తి ఒక్కటవుతారు. మహిళలకు స్వేచ్చ అవసరమంటూ.. శక్తికి అన్ని విషయాల్లోనూ సపోర్ట్‌గా ఉంటాడు శివ. అయితే, భర్త మంచితనాన్ని అలుసుగా తీసుకుంటుంది శక్తి. అతన్ని పట్టించుకోకుండా, ఇంటి పనులు కూడా చేసుకోకుండా.. ఎప్పుడూ సోషల్ మీడియాలోనే కాలం గడుపుతుంటుంది. మొదట్లో బాగానే ఉన్నా..
కొన్ని రోజులకు ఇద్దరి మధ్యా మనస్పర్థలు తలెత్తుతాయి.
దాంతో తల్లిదండ్రులకు చెప్పకుండానే.. విడాకులకు సిద్ధమవుతారు. పరస్పర అంగీకారంతో కోర్టు మెట్లు ఎక్కుతారు. వీరి కేసును న్యాయవాదులు నారాయణ (ఆర్జె. విఘ్నేశ్‌కాంత్), లక్ష్మి (షీలా రాజ్‌కుమార్) టేకప్ చేస్తారు. చిన్నగా మొదలైన శివ-శక్తి గొడవలు.. విడాకుల దాకా ఎలా వెళ్లాయి? వీరి కేసు టేకప్ చేసిన న్యాయవాదుల గతం ఏమిటి? చివరికి శివ-శక్తి కలిశారా? లేదా? అనేది మిగతా కథ.