Shanmukha Review | టాలీవుడ్ యువ నటుడు ఆది సాయికుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమా ప్రేమకావాలి అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత లవ్లీ, శశీ, సుకుమారుడు వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఆది చాలారోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘షణ్ముఖ’. ఈ సినిమాకు షణ్ముగం సాప్పని దర్శకత్వం వహించగా.. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ఫేమ్ అవికాగోర్ కథనాయికగా నటించింది. సాప్‌బ్రో ప్రొడక్షన్స్ పతాకంపై తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మించారు. డివోషనల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా మూవీ రివ్యూ ఎలా ఉందో చూసుకుంటే..
కథ విషయానికి వస్తే..
ఒక మారుముల గ్రామంలో నిత్యం పూజలు చేసే ఉపాసకుడు విగాండ (చిరాగ్ జానీ) దంపతులకు ఆరు ముఖాలతో, కురూపంగా ఉన్న ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ బాలుడి వికృత ముఖాన్ని చూసిన ఊరిలోని ప్రజలందరూ అతడిని చూసి భయపడిపోతుంటారు. అయితే విగాండ్ తన కుమారుడికి “షణ్ముఖ” అని పేరు పెట్టి కొడుకు రూపాన్ని మార్చాలనే ఉద్దేశంతో కాశీకి వెళ్లి క్షుద్ర పూజలు నేర్చుకుంటాడు. ఆ తర్వాత తిరిగొచ్చిన అతను తన కుమారుడి సాధారణ రూపం కోసం బామ్మర్ది సాయంతో తాంత్రిక పూజలు ప్రారంభిస్తాడు.
మరోవైపు కార్తీ (ఆది సాయికుమార్) పోలీస్ ఆఫీసర్. డ్రగ్స్ మాఫియాను పట్టుకొనేందుకు వెళ్లిన సమయంలో జరిగిన దాడిలో తన పిస్టల్ కోల్పోతాడు. దీంతో తన తప్పును సరిదిద్దుకోవడానికి కమిషనర్ అతడికి వారం రోజుల గడువు ఇస్తాడు. మరోవైపు, బెంగళూరులో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న సారా మహేశ్ (అవికా గోర్) తన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్‌కు వస్తుంది. తన మాజీ ప్రియుడు కార్తీని కలిసి అదృశ్యం అవుతున్న అమ్మాయిల ఆచూకీ కోసం తను రీసెర్చ్ చేస్తున్నట్లు ఈ విషయంలో సాయం కావాలని అడుగుతుంది. దీనికి ఒప్పుకున్న కార్తీ తప్పిపోయిన అమ్మాయిల జాడ గురించి వెతకడం మొదలుపెడతాడు.
అయితే క్షుద్ర పూజలు నేర్చుకుని వచ్చిన విగాండ తన కుమారుడు అందంగా మారడం కోసం ఎటువంటి నేరపూరిత చర్యలకు పాల్పడ్డాడు? అమ్మాయిల అదృశ్యాల వెనుక విగాండ్కు ఏదైనా సంబంధం ఉందా? కార్తీ, సారా మధ్య గతంలో ఎందుకు విడిపోయారు? కార్తీ తన కోల్పోయిన తుపాకీని తిరిగి పొందగలిగాడా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
క్షుద్ర పూజలు బ్యాక్‌డ్రాప్‌లో ఇంతకుముందు అరుంధతి వంటి చాలా సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. అయితే తాజాగా ఇలాంటి కథతోనే మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు షణ్ముగం. మూవీ స్టార్ అవ్వగానే ఆరు తలల ముఖంతో పుట్టిన పిల్లాడు అనగానే ప్రేక్షకులలో ఆసక్తి మొదలైంది. ఆ తర్వాత తన కొడుకును సాధారణ మనిషిగా మర్చాడానికి విగండా ఏం చేశాడు అనేది ఆసక్తిగా చూపించాడు దర్శకుడు. అయితే సడన్‌గా కథ హీరో వైపు తిరగడంతో సినిమా ట్రాక్ తప్పిందా అనే అనుమానం ప్రేక్షకులలో కలుగుతుంది. సాయి కుమార్, అవికగోర్లపై వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల ఊహకందేలా ఉంటాయి. దీంతో ఫస్ట్ ఆఫ్ కొంచెం నెమ్మదిగా సాగుతుంది. అయితే కార్తి, సారా కలుసుకున్న అనంతరం సినిమా ఎటువెళుతుంది అనేది ఆసక్తిగా ఉంటుంది. సెకండాఫ్‌లో కార్తీ, సారా ఇన్వెస్ట్‌గేషన్ అంటూ తిరగడం. ఆ తర్వాత ట్విస్ట్‌లను ఒక్కోక్కటిగా రివీల్ చేయడం చేశాడు దర్శకుడు. ఇందులో క్షుద్ర పూజలు చేసే మాంత్రికులు పూజల విషయంలో దర్శకుడు మరింత పరిశోధన చేసి తెరకెక్కిస్తే సినిమా మరో లెవల్లో ఉండేది. తెరపై హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులకు కాస్తంత రిలీఫ్ ఇస్తుంది. కానీ సినిమాలో అది అవసరం లేకున్నా.. కావాలని ఇరికించినట్టు తెలుస్తుంది. ఓవరాల్‌గా హార్రర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది.
నటినటులు
ఆది సాయికుమార్ పోలీస్ అధికారి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. తన పాత్రకు సరిపడే ధోరణి, శారీరక హావభావాలను అద్భుతంగా ప్రదర్శించాడు. అయితే, కథలో వైవిధ్యమైన మలుపులు.. అనేక పాత్రలు ఉండటం వల్ల ఆది హైలైట్ అవ్వడానికి అవకాశం పెద్దగా దక్కలేదు. అవికా గోర్ తన ఆకర్షణీయమైన గ్లామర్‌తో పాటు నటనలో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. చిరాగ్ జానీ మరియు ఆదిత్య ఓం తమ పాత్రల్లో సమర్థవంతంగా కనిపించారు. ఆరియానా గ్లోరితో సహా ఇతర నటీనటులు కేవలం అతిథి పాత్రలకు మాత్రమే పరిమితమయ్యారు.
సాంకేతిక అంశాల గురించి చెప్పాలంటే, విష్ణు ఆర్ఆర్ సినిమాటోగ్రఫీ సమర్థవంతంగా పనిచేసింది. ఎంఏ మాలిక్ ఎడిటింగ్ విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలాన్ని చేకూర్చింది. నిర్మాణ విలువలు సంస్థ ప్రతిష్ఠకు తగ్గట్టుగా ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
రేటింగ్ : 2.5/5