‘నేను జీవితంలో మోసం, దగా చేసింది కేవలం నా సినిమా టికెట్ కొన్న ప్రేక్షకులను మాత్రమే. మరో మంచి సినిమాతో వారికి వినోదాన్ని అందిస్తా’ అన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా ఆయన రూపొందించిన ‘లైగర్’ సినిమా అపజయం పాలైంది. దీంతో నిర్మాతగా వ్యవహరించిన ఆయనకు, పంపిణీదారులకు ఆర్థికంగా నష్టాలు మిగిలాయి. ఈ సినిమాకు ముందు పూరి లైనప్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఈ చిత్ర ఫలితంతో తారుమారయ్యాయి. ఈ నేపథ్యంలో పూరి ఒక లేఖ రాసి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఆయన స్పందిస్తూ…‘జీవితంలో జయాపజయాలు సహజమే. ఏదీ శాశ్వతం కాదు. విజయం దక్కితే డబ్బు వస్తుంది. అపజయం పాఠాలు నేర్పిస్తుంది. మనకు డబ్బుతో పాటు జీవిత పాఠాలు నేర్చుకోవడమూ ముఖ్యమే. చెడు జరిగితే నీ చుట్టూ ఉన్న చెడ్డవాళ్లు వెళ్లిపోతారు. మంచి వాళ్లు మిగులుతారు. జీవితంలో రిస్క్ చేయాలి. ఏ రిస్క్ చేయకపోవడమే పెద్ద రిస్క్. మంచి చెడు ఏది జరిగినా హీరోలా బతకాలని ప్రయత్నిస్తున్నా. నేను ఇప్పటిదాకా ఎవర్నీ మోసం చేయలేదు. మంచి సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పిస్తా’ అని పేర్కొన్నారు.