అగ్ర హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎఫ్-2, ఎఫ్-3 చిత్రాల తర్వాత వీరిద్దరి కలయిలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం కేరళలోని పొల్లాచ్చిలో జరుగుతున్న షూటింగ్లో హీరో వెంకటేష్ జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ని మాజీ పోలీస్ అధికారిగా పరిచయం చేస్తూ స్పెషల్వీడియోను విడుదల చేశారు. నెలరోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో టాకీ పార్ట్‌తో పాటు సాంగ్స్ తెరకెక్కించబోతున్నారు.
హీరో, ఆయన భార్య, మాజీ ప్రేయసి మధ్య నడిచే ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ ఇదని, ఆద్యంతం వినోదప్రధానంగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యరాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు.