71st National Film Awards | మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. 2023లో విడుదలైన చిత్రాలకు గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను ఈరోజు సాయంత్రం జ్యూరీ ప్రకటించబోతున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులతో పాటు, పరిశ్రమ వర్గాలు ఈ ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
ఈ సాయంత్రం 4 గంటలకు జ్యూరీ సభ్యులు తమ ఫైనల్ రిపోర్ట్‌ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు, సహాయ మంత్రి ఎల్. మురుగన్‌కు అందజేయనున్నారు. ఆ తర్వాత, సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో ఏర్పాటు చేయనున్న విలేకరుల సమావేశంలో విజేతలను అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం.
ఉత్తమ నటుడు, నటి అవార్డులు ఎవరికి దక్కేను.?
తాజా సమాచారం ప్రకారం ఈసారి ఉత్తమ నటుడితో పాటు నటి విషయంలో పలు పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో 12 ఫెయిల్ (12th Fail) చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకోవడంతో పాటు తన నటనతో ప్రశంసలు అందుకున్న నటుడు విక్రాంత్ మస్సే ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (Mrs Chatterjee Vs Norway) సినిమాతో విజయం అందుకోవడంతో పాటు తన నటనతో ప్రశంసలు దక్కించుకున్న బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ ఉత్తమ నటి అవార్డును దక్కించుకోబోతున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై జ్యూరీ ప్రకటించే వరకు వేచి చూడాల్సి ఉంది.