Filmfare 2025 | బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా భావించే 70వ హ్యుందాయ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్-2025 వేడుక గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి అతిరథ మహారథులు హాజరుకాగా.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్‌లుగా వ్యవహారించి అభిమానుల్లో జోష్ నింపారు. 2024 విడుదలైన చిత్రాలకు ఈ అవార్డులను ప్రకటించగా.. లాపతా లేడీస్, చందు ఛాంపియన్, కిల్ చిత్రాలు సత్తా చాటాయి.
దర్శకురాలు కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ చిత్రం అత్యధిక అవార్డులను కైవసం చేసుకుని సత్తా చాటింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకురాలు (కిరణ్ రావు), ఉత్తమ సహాయ నటుడు (రవి కిషన్), ఉత్తమ సహాయ నటి (ఛాయా కదమ్) సహా పలు విభాగాల్లో ఈ చిత్రం అవార్డులు గెలుచుకుంది. ఈసారి ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు పంచుకున్నారు. ‘చందు ఛాంపియన్’ చిత్రానికి కార్తీక్ ఆర్యన్, ‘ఐ వాంట్ టు టాక్’ చిత్రానికి అభిషేక్ బచ్చన్ సంయుక్తంగా ఈ గౌరవాన్ని అందుకున్నారు. ‘జిగ్రా’ చిత్రంలో అద్భుత నటనకు గాను ఆలియా భట్ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఉత్తమ నటుడు (క్రిటిక్స్) అవార్డును ‘శ్రీకాంత్’ చిత్రానికి రాజ్‌కుమార్ రావు గెలుచుకోగా, ‘లాపతా లేడీస్’ చిత్రానికి ప్రతిభా రాంటా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
బాలీవుడ్‌కు చేసిన విశేష సేవలకు గాను సీనియర్ నటి జీనత్ అమన్ మరియు దర్శకుడు శ్యామ్ బెనెగల్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులతో సత్కరించబడ్డారు. ‘లాపతా లేడీస్’ చిత్రంలోని పాటను ఆలపించినందుకు గాను అరిజిత్ సింగ్ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మేల్) అవార్డును గెలుచుకున్నారు. దీంతో ఫిల్మ్‌ఫేర్‌లో అత్యధికంగా 8 ఉత్తమ సింగర్ అవార్డులు గెలుచుకున్న కిషోర్ కుమార్‌తో సమానంగా నిలిచి అరిజిత్ సింగ్ రికార్డు సృష్టించారు. మరోవైపు విజేతల జాబితాను చూసుకుంటే
ఉత్తమ చిత్రం – లాపతా లేడీస్
ఉత్తమ దర్శకుడు – కిరణ్ రావు (లాపతా లేడీస్)
ఉత్తమ నటుడు (మేల్) – కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన్)
ఉత్తమ నటుడు – అభిషేక్ బచ్చన్ (ఐ వాంట్ టు టాక్)
ఉత్తమ నటి (ఫిమేల్) – ఆలియా భట్ (జిగ్రా)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – రాజ్‌కుమార్ రావు (శ్రీకాంత్)
ఉత్తమ నటి (క్రిటిక్స్) – ప్రతిభా రాంటా (లాపతా లేడీస్)
ఉత్తమ సహాయ నటుడు – రవి కిషన్ (లాపతా లేడీస్)
ఉత్తమ సహాయ నటి – ఛాయా కదమ్ (లాపతా లేడీస్)
ఉత్తమ నటుడు (మేల్ డెబ్యూ) లక్ష్య లాల్వానీ (కిల్)
ఉత్తమ నటి (ఫిమేల్ డెబ్యూ) నితాన్షి గోయెల్(లాపతా లేడీస్)
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మేల్) అరిజిత్ సింగ్ (8వ ఫిల్మ్‌ఫేర్ అవార్డు) లాపతా లేడీస్
లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు (జీనత్ అమన్), (శ్యామ్ బెనెగల్)