69th National Film Awards | తెలుగు వెండితెర 68 ఏండ్ల వెలితి తీరింది. జాతీయ ఉత్తమ నటుడిగా ఇంతవరకు తెలుగువారెవరికీ చోటు దక్కలేదన్న బాధ ఇకలేదు. ఆ ఘనత సాధించిన తొలి నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. పుష్ప సినిమాలో ఎర్రచందనచోరుడిగా కనబర్చిన నటనకుగాను ఆయన రజత కమలం అందుకోనున్నారు. గురువారం ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా సత్తాచాటింది. ఆస్కార్‌ను అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా.. ఏకంగా 6 క్యాటగిరీల్లో నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నది.
భారతీయ చలన చిత్ర ప్రస్థానంలో సమకాలీన తెలుగు సినిమా సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తున్నది. ఈ ఏడాది ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకొని విశ్వవేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన అద్భుతఘట్టం స్మృతిపథంలో కదలాడుతుండగానే తాజాగా తెలుగు సినిమా కీర్తికిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పురస్కారాన్ని గెలుచుకొని సరికొత్త రికార్డు సృష్టించారు. ‘పుష్ప’ చిత్రంలో అసమాన అభినయానికిగాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన తొలి తెలుగు నటుడిగా నిలిచారు. 2021 సంవత్సరానికిగాను జాతీయ చలన చిత్ర అవార్డులను గురువారం ప్రకటించారు. ఈ పురస్కారాల్లో ‘ఆర్ఆర్ఆర్’ ‘పుష్ప’ చిత్రాలకు అవార్డుల పంట పండింది. ‘ఆర్ఆర్ఆర్’ ఆరు అవార్డులతో, పుష్ప చిత్రం రెండు పురస్కారాలతో జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘ఉప్పెన’ ఎంపికైంది. ఉత్తమ జనరంజక చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ జాతీయ అవార్డును గెలుచుకుంది. ఉత్తమ నటి అవార్డును అలియాభట్ (గంగూబాయి కతియావాడి), కృతిసనన్ (మిమి) సంయుక్తంగా గెలుచుకున్నారు. ‘రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్’ జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారాన్ని గెలుచుకుంది.
చరిత్రలో ఎవరికీ దక్కని ఘనత
90 ఏండ్లకు పైబడిన సుదీర్ఘ తెలుగు సినిమా చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. లబ్దప్రతిష్టులైన నటులెందరో ఈ అవార్డు రేసులో నిలిచినప్పటికీ ఎవరినీ అదృష్టం వరించలేదు. ఇప్పుడా అరుదైన ఖ్యాతిని అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప-ది రైజ్’ చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ కనబరచిన అభినయం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ సినిమాలో ఎర్రచందనం కూలీగా మొదలై సిండికేట్‌ను శాసించే నాయకుడిగా పుష్పరాజ్ ప్రయాణం..ఈ క్రమంలో ఆయన పలికించిన భావోద్వేగాలు, సంఘర్షణ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఏ సన్నివేశం చూసినా ‘తగ్గేదేలే’ అంటూ వన్‌మ్యాన్ షోగా సినిమాను రక్తి కట్టించారు అల్లు అర్జున్. మాస్ లుక్‌లో ఆయన మేకోవర్, నటనాపరంగా కనబరచిన వేరియేషన్స్ హైలైట్‌గా నిలిచాయి. చిత్తూరు యాసలో ఆయన పలికిన సంభాషణలు కూడా మెప్పించాయి.

‘పుష్ప’కు కలిసొచ్చిన అంశాలు
69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో ఓ తెలుగు నటుడు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కైవసం చేసుకోవడం ఇదే ప్రథమం. ‘పుష్ప’ చిత్రం జాతీయ పురస్కారాల్లో సత్తా చాటడానికి అనేక అంశాలు కలిసొచ్చాయి. ఇందుకు అల్లు అర్జున్ అభినయం ప్రధాన కారణంగా నిలవగా, ఈ సినిమా పాటలు, మేకింగ్ కూడా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. ‘పుష్ప’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ఈ సినిమా దుమ్మురేపింది. ఇక పాటలు దక్షిణాది అన్ని భాషల్లో సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఉత్తరాదిన కూడా మాస్ ఆడియెన్స్‌కు చేరువయ్యాయి. ‘సామీ సామీ’ ‘ఏయ్ బిడ్డా’ ‘ఊ అంటావా మావ’ ‘దాక్కో దాక్కో’ ఇలా ప్రతీ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ మాస్ అప్పీల్ బీ, సీ సెంటర్లలోని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇక కెరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన పాత్రల్లో కనిపించడానికి ప్రాధాన్యతనిచ్చే అల్లు అర్జున్ ఈ సినిమా కోసం మరింతగా కష్టపడ్డారు. తొలిసారి డీగ్లామర్ లుక్‌తో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. ఆయన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ ఎపిసోడ్స్..ఇలా ప్రతీ అంశంలో ది బెస్ట్ అనిపించుకున్నారు అల్లు అర్జున్. ఈ సినిమాతో ఆయన నేషనల్ స్టార్‌గా అవతరించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 365 కోట్ల వసూళ్లను సాధించింది.
ట్రెండ్ సెట్టర్ అల్లు అర్జున్
టాలీవుడ్లో సిక్స్‌ప్యాక్ ట్రెండ్‌ను మొదలుపెట్టింది అల్లు అర్జున్ కావడం విశేషం. ‘దేశముదురు’ చిత్రంలో ఆయన తొలిసారి సిక్స్‌ప్యాక్‌లో కనిపించారు. ఇక ‘వరుడు’ చిత్రంలో ఆయన హాండ్సమ్ లుక్స్‌తో కనిపించారు. ఈ సినిమాతో ఆయనకు మహిళా అభిమానుల్లో ఫాలోయింగ్ పెరిగింది. సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింతగా చేరువయ్యారు. ‘పుష్ప’ చిత్రంలో ‘ఫ్లవర్ అనుకుంటివా ఫైర్’ ‘తగ్గేదేలే’ వంటి సంభాషణలో దేశవ్యాప్తంగా యూత్‌ని విశేషంగా ఆకట్టుకున్నారు. ఇక అల్లు అర్జున్‌లో మరో ప్రత్యేక లక్షణం నృత్యాల్లో అద్భుత ప్రతిభ కనబరచడం. దక్షిణాది ఇండస్ట్రీలో ఉత్తమ డ్యాన్సర్లలో ఆయన్ని ఒకరిగా చెబుతారు. ఇండస్ట్రీని ఊపేసిన పలు హిట్ నెంబర్స్ అల్లు అర్జున్ ఖాతాలో ఉన్నాయి.
ఉత్తమ చిత్రం ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్

‘చంద్రయాన్-3’ ప్రాజెక్ట్ అంతరిక్ష సాంకేతికతలో భారత్ సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ నేపథ్యంలో ‘రాకెట్రీ : ది నంబీ ఎఫెక్ట్’ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకోవడం విశేషం. ఈ చిత్రాన్ని ఇస్రో మాజీ సైంటిస్ట్ యస్. నంబినారాయణ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఆర్.మాధవన్ కీలక పాత్రను పోషించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వర్తించాడు. ఇస్రో శాస్త్రవేత్త అయిన నంబినారాయణ్ గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో నిరపరాధిగా బయటపడటానికి ఆయన చేసిన ప్రయత్నాలేమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. నంబి నారాయణ్ అరెస్ట్ మొదలుకొని ఆయన నిర్దోషిగా విడుదలయ్యే క్రమాన్ని ఈ సినిమాలో ఉత్కంఠభరితంగా చూపించారు. విక్రమ్ సారాబాయ్, సతీష్‌ధావన్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలతో కలిసి నంబి నారాయణ్ అంతరిక్ష పరిశోధనకు అవసరమైన శాస్త్ర సాంకేతికతను ఎలా సంపాదించారో ఈ సినిమాలో ఆసక్తిరంగా దృశ్యమానం చేశారు.
‘ఆర్ఆర్ఆర్’కు అవార్డుల పంట

‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు గెలుచుకొని భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఆరు జాతీయ అవార్డులతో సత్తా చాటింది. ఉత్తమ జనరంజక చిత్రం, ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్, ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ విభాగాల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం అవార్డులను కైవసం చేసుకుంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్‌చరణ్ కథానాయకులుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల చరిత్రకు కాల్పనిక అంశాలను జోడించి ఈ సినిమా తీశారు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, హృదయాన్ని పిండేసే భావోద్వేగాలు, రొమాంచితమైన పోరాట ఘట్టాలు..ఎన్టీఆర్, రామ్‌చరణ్ పోటాపోటీ నటన ఈ సినిమాకు ప్రధానాకర్షణగా నిలిచాయి. చారిత్రక నేపథ్యంలో స్నేహబంధాన్ని, దేశభక్తిని కలబోసి రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
అడవితల్లి గొప్పతనాన్ని చెప్పిన గీతం
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకుగాను ఆస్కార్ అవార్డు గెలుచుకొని ఆ ఘనత సాధించిన తొలి భారతీయ లిరిక్ రైటర్‌గా రికార్డు సృష్టించారు ప్రముఖ గీత రచయిత చంద్రబోస్. తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ‘కొండపొలం’ చిత్రానికి గాను ఆయన ఉత్తమ గేయ రచయితగా అవార్డును సాధించారు. ఈ చిత్రంలో ‘ధమ్ ధమా ధమ్’ పాటకు ఈ అవార్డు లభించింది. అడవి తల్లి ఔన్నత్యాన్ని, ప్రకృతిపట్ల ఆరాధనా భావాన్ని తెలియజేస్తూ సాగిన ఈ పాట అద్భుత సాహిత్యంతో సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంది.
ఉత్తమ నటి అవార్డుకు ఇద్దరు నాయికలు

Alia
సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘గంగూబాయి కాఠియావాడి’ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించిన అలియాభట్, ‘మిమి’ చిత్రంలో నటించిన కృతిసనన్ ఈ ఏడాది ఉత్తమ నటి అవార్డును సంయుక్తంగా గెలుచుకున్నారు. వేశ్యగా జీవితాన్ని ప్రారంభించిన గంగూబాయి కామాటిపురకు నాయకురాలిగా ఎలా ఎదిగింది? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సవాళ్లేమిటి? దాదాపు నాలుగువేల మంది మహిళల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం ఏమిటి? అనే అంశాలను ఈ సినిమాలో చూపించారు. ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ అనే నవల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో అలియాభట్ నటన అందరి ప్రశంసలందుకుంది. ఈ పాత్రలో ఆమె హావభావాలు, గాంభీర్యత, సంభాషణలు శభాష్ అనిపించాయి. ఇక ‘మిమి’ చిత్రంలో కృతిసనన్ తనదైన నటనతో మెప్పించింది. అద్దె గర్భం నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మిమి పాత్రలో కృతిసనన్ చక్కగా ఒదిగిపోయింది. సరోగసీ నేపథ్యంలో చాలా చిత్రాలొచ్చినా వాటిలో ‘మిమి’ ప్రత్యేకంగా నిలిచిపోయింది. ముఖ్యంగా కృతిసనన్ కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబరచింది.
హృద్యమైన ప్రేమకథ ‘ఉప్పెన’

ఈ ఏడాది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘ఉప్పెన’ అవార్డును గెలుచుకుంది. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌తేజ్ కథానాయకుడిగా పరిచయమైన చిత్రమిది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయయ్యారు. నాయిక కృతిశెట్టికి కూడా తొలి చిత్రమిదే. నిర్మాణం నుంచే ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. సామాజిక అంతరాల నేపథ్యంలో సాగే ఈ కథలోని భావోద్వేగాలు హృదయాల్ని స్పృశించాయి. మత్స్యకారుల కుటుంబానికి చెందిన ఓ పేదింటి అబ్బాయి , సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తే వారికి ఎదురైన అడ్డంకులు ఏమిటన్నదే ఈ చిత్ర కథాంశం. పెద్దింటి అమ్మాయి, పేదింటి అబ్బాయి తరహా ప్రేమకథలు కొత్తేమీ కాకపోయినా ఈ సినిమాలో చర్చించిన ఓ అంశం ఈ కథను మిగతా ప్రేమకథలకు భిన్నంగా నిలబెట్టింది. ముఖ్యంగా పతాక ఘట్టాలు భావోద్వేగాలను పంచాయి. ప్రేమకథా చిత్రాల్లో ఓ విభిన్నమైన ముగింపుతో ఈ సినిమా ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. దర్శకుడిగా బుచ్చిబాబు సానా తొలి చిత్రంతోనే తన ప్రతిభను చాటాడు. వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి నటనకు కూడా అందరిని ఆకట్టుకుంది.
నల్లగొండకు చెందిన డాక్టర్ పురుషోత్తమాచార్యులు 2021 సంవత్సరపు జాతీయ అవార్డులలో ఉత్తమ సినీ విమర్శకుడిగా జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. గత రెండేళ్లుగా మిసిమి మాసపత్రికలో సినిమా పాటల్లో శాస్త్రీయ సంగీతంపై ఆయన చాలా లోత్తెన పరిశోధన చేస్తూ వ్యాసాలు రాస్తూ వున్నారు.
అవార్డుల విజేతలు
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప)
ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి
కతియావాడి), కృతిసనన్ (మిమీ)
ఉత్తమ చిత్రం: రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్
ఉత్తమ జనరంజక చిత్రం: ఆర్ఆర్ఆర్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం: ఉప్పెన
ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి-మరాఠీ)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీప్రసాద్ (పుష్ప)
ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: కీరవాణి (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్క్ష్రిత్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ లిరిక్స్: చంద్రబోస్ (కొండపొలం)
ఉత్తమ నేపథ్యగానం: కాలభైరవ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ యాక్షన్ డైరెక్టర్: కింగ్ సోలమన్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ సినీ విమర్శకుడు: డాక్టర్ పురుషోత్తమా చార్యులు
ఉత్తమ పిల్లల చిత్రం: గాంధీ అండ్ కో (గుజరాతీ)
ఉత్తమ హిందీ చిత్రం: సర్దార్ ఉద్దామ్
ప్రతిష్టాత్మక 69వ జాతీయ అవార్డులను పొందిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికి పేరు పేరునా నా హృదయపూర్వక అభినందనలు
-నందమూరి బాలకృష్ణ.
69వ జాతీయ అవార్డుల్లో వివిధ కేటగిరలో అవార్డులు సాధించిన అందరికి హృదయ పూర్వక అభినందనలు
-అనిల్ కుర్మాచలం, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్
69వ జాతీయ సినీ పురస్కారాలలో తెలుగు చిత్ర పరిశ్రమకు పలు విభాగాల్లో పురస్కారాలు దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించింది.‘పుష్ప’ చిత్రానికి అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం అందరూ ఆనందించదగ్గ విషయం. ఆయనకు అభినందనలు. ఈ సందర్భంగా అవార్డు సాధించిన ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు.
– పవన్‌కల్యాణ్
జాతీయ అవార్డులు సాధించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు.. ముఖ్యంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సాధించిన ప్రియమైన అల్లు అర్జున్‌కు నా అభినందనలు.ఈ విషయంలో ఎంతో గర్వపడుతున్నాను.
-చిరంజీవి
మనవాళ్లు సిక్సర్ కొట్టారు. నేషనల్ అవార్డ్స్‌కు ఎంపికైన సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందానికి కంగ్రాట్స్. జ్యూరీకి కృతజ్ఞతలు.
– రాజమౌళి
కంగ్రాట్స్ అల్లు అర్జున్ బావ. ‘పుష్ప’ సినిమాకు పొందిన అవార్డుకు నువ్వు సంపూర్ణంగా అర్హుడవు.
-ఎన్టీఆర్