కరీంనగర్‌కు చెందిన వారాల అన్వేష్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ గా రూపొందించిన సినిమా ‘మొనిహార’ 55 వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఎంపికయింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ శుక్రవారం ప్రకటించింది. భారత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 55 వ ‘ఇఫీ’ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) నవంబర్ 20 నుంచి 28 వరకు గోవా లో జరుగుతుంది. వివిధ భారతీయ భాషల్లోంచి వచ్చిన నాన్ ఫీచర్ సినిమాల్లోంచి ఎంపికయిన వాటిల్లో ‘మొనిహార’ కూడా ఉంది. ఈ చిత్రం బెంగాలీ భాషలో నిర్మించారు. కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో వారాల అన్వేష్ సినిమాటోగ్రఫీలో పీజీ కోర్స్ పూర్తి చేశాడు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ రాసిన ‘మొనిహార’ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి సుభాదీప్ బిస్వాస్ దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఇక గతంలో వారాల అన్వేష్ సినిమాటోగ్రాఫర్‌గా రూపొందిన ‘అపార్’ మరియు ‘నవాబి శౌక్’ చిత్రాలు ఇండో బంగ్లాదేశ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌తో సహా అనేక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడి ప్రశంసల్ని అందుకున్నాయి. ఇంకా అన్వేష్ తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన పట్నాలపైన పూర్తి నిడివి డాక్యుమెంటరీ తీసాడు. అది హైదరాబాద్ లో జరిగిన బతుకమ్మ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది.