Rajamouli – Mahesh Project | ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మహేశ్ – రాజమౌళి కాంబోలో వస్తున్న తొలి చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రియంకా చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒడిషా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది.
ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా.. తదుపరి షెడ్యూల్లో భాగంగా నీటిలో ఒక భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో మహేశ్ బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు సుమారు 3 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు పాల్గొననున్నారని తెలుస్తోంది. వీరంతా ఈ సన్నివేశం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారని సమాచారం. ఈ సీక్వెన్స్‌ను మే నుంచి జూన్ వరకు చిత్రీకరించనున్నారు. దీని కోసం హైదరాబాద్‌లో ఒక భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ల నేతృత్వంలో ఈ యాక్షన్ ఘట్టాన్ని షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా సాహసయాత్ర చేసే ఒక సాహసికుడి కథగా ఉండనుంది.