Hindi Television | గతేడాది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సౌత్ సినిమాల హవా కొనసాగింది. సౌత్ సినిమాల దెబ్బకు బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా షాక్ అయింది. సౌత్ నుండి సినిమా వస్తుందంటే బాలీవుడ్ సినిమాలు కనీసం రెండు, మూడు వారాలు గ్యాప్ తీసుకుని రిలీజ్ అయ్యేంత వరకు వెళ్లాయంటే.. సౌత్ సినిమాల డామినేషన్ గతేడాది ఏ విధంగా ఉందో తెలుస్తుంది. ఒకప్పుడు సౌత్ సినిమాలను తక్కువ చేసి మాట్లాడిన హిందీ పరిశ్రమ.. ఇప్పుడు అదే సౌత్ సినిమాలకు నీరాజనం పలుకుతుంది. గతేడాది ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మొదలుకొని, ‘కేజీఎఫ్’, ‘కార్తికేయ’, ‘కాంతార’ వంటి పలు సౌత్ సినిమాలు హిందీ సినిమాలతో పోటీ పడి మరీ అక్కడ విజయ భేరి మోగించాయి. నిజానికి పుష్ప సినిమా నుండే హిందీలో సౌత్ సినిమాల హవా కొనసాగింది. కాగా తాజాగా సౌత్ సినిమాలు నార్త్ టెలివిజన్‌లోనూ సత్తా చాటాయి.
తాజాగా విడుదలైన టాప్ టీవీ ప్రీమియర్ రేటింగ్స్లలో సౌత్ ఇండియన్ డబ్బింగ్ సినిమాల హవా కొనసాగింది. లేటెస్ట్గా రిలీజైన ఈ లిస్టు టాప్-5లో మొదటి మూడు స్థానాలు సౌత్ సినిమాలే ఆక్రమించాయి. మొదటి స్థానంలో దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఉండగా.. రెండో స్థానంలో క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ ‘పుష్ప’ ఉంది. ఇక మూడో స్థానంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్-2’ ఉన్నాయి. ఇలా వరుసగా మూడు స్థానాల్లో సౌత్ సినిమాలుండటం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో ‘సూర్యవంశీ’, ‘భూల్ భూలయ్య-2’ హిందీ సినిమాలున్నాయి. టాప్ 10లో ‘కార్తికేయ’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు చోటు సంపాదించుకున్నాయి. బిగ్ స్క్రీన్లోనే కాదు స్మాల్ స్క్రీన్‌లోనూ సౌత్ సినిమాలు నార్త్‌లో విజయ ఢంకా మోగించాయి.