Zomato | ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటోకు సోమవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టాక్‌మార్కెట్లలో సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లోనే 14 శాతానికి పైగా జొమాటో స్క్రిప్ట్ పతనమై రూ.46కి చేరుకున్నది. ఇది అత్యంత కనిష్ట స్థాయి.. 52 వారాల సరికొత్త కనిష్ట రికార్డు. సోమవారం స్టాక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 11.09 శాతం పతనమై రూ.47.70కు చేరుకున్నది. ఐపీవో ద్వారా స్టాక్‌మార్కెట్లలో లిస్టయిన సంస్థల వాటాలపై ఏడాది వరకు లాకిన్ పీరియడ్ ఉంటుంది. దీనికితోడు బ్లింకిట్ సంస్థతో ఒప్పందం ఆమోదం పొందిన తర్వాత జొమాటో షేర్లు ఒత్తిడికి గురవడం ఇతర కారణాల్లో ఒకటని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వైస్‌ప్రెసిడెంట్ (రీసెర్చ్) అనూజ్ గుప్తా చెప్పారు.
గతేడాది జూలై 23న దేశీయ స్టాక్ మార్కెట్లలో జొమాటో షేర్లు లిస్టయ్యాయి. దీని ప్రకారం ఇప్పుడు జొమాటో లాకిన్ పీరియడ్ పూర్తయింది. ఇలా లాకిన్ పీరియడ్‌లో ఉన్న ఉద్యోగులు, ప్రమోటర్లు, ఇతర పెట్టుబడిదారుల (78 శాతం) కు 613 కోట్ల వాటాలు ఒత్తిడికి గురయ్యాయి. లాకిన్ పీరియడ్ పూర్తయ్యాక ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. ఐపీవో ద్వారా స్టాక్‌మార్కెట్లలో ఎంటరైన తర్వాత జొమాటో షేర్ ఒకానొక దశలో రూ.70-75లకు చేరుతుందిన మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ బ్లింకిట్ అనే స్టార్టప్ సంస్థను రూ.4,447 కోట్లకు టేకోవర్ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి జొమాటో షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి.
ఐపీవోకు వెళ్లకముందు జొమాటోలో ఉబెర్ క్యాబ్ 7.78 శాతం, అలీ పే 7.1, ఆంట్ ఫైనాన్సియల్ 6.99, టైగర్ గ్లోబల్ 5.11, సిక్యూయా క్యాపిటల్ 5.10, టెమాసెక్ 3.11 వాటాలు, ఫుడ్‌టెక్ కంపెనీ డెలివరీ హీరో 1.36 శాతం కలిగి ఉన్నాయి. గతేడాది జూలై 23న స్టాక్మార్కెట్లో లిస్టయినప్పుడు ఇష్యూ ధర రూ.76గా ప్రకటించారు. అది బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో 51 శాతానికి పైగా ట్రేడయి రూ.115కి దూసుకెళ్లింది. అటుపై గతేడాది నవంబర్ 16న 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.169.1కి చేరకున్నాయి. లైఫ్ టైం గరిష్టస్థాయికి చేరుకున్న జొమాటో షేర్ కొన్ని సెషన్లలో 52 వారాల కనిష్ట స్థాయి నమోదు చేస్తున్నది.