Minimum Pension | ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు గుడ్ న్యూస్.. ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. తన సబ్స్క్రైబర్లకు నెలవారీ కనీస పెన్షన్ను రూ.1000 నుంచి రూ.9000లకు పెంచనున్నదని సమాచారం. ఈ విషయమై కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ వచ్చేనెలలో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటుందని తెలిసింది. ఈ సమావేశంలో ఉద్యోగుల పెన్షన్ స్కీం (ఈపీఎస్) కింద పెన్షన్ను రూ.1000 నుంచి రూ.9000లకు పెంచే అంశం ఎజెండా ఉందని విశ్వసనీయ వర్గాల కథనం.
పెన్షనర్లు కొన్నేండ్లుగా తమ కనీస పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పలు దఫాల చర్చలు కూడా జరిగాయి. ఈ దిశగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసులను వచ్చే నెలలో కార్మికశాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో చర్చిస్తారని వినికిడి. గతేడాది మార్చిలో జరిగిన పార్లమెంటరీ స్థాయీ సంఘం భేటీలో కనీస పెన్షన్ రూ.1000 నుంచి రూ.3000లకు పెంచాలని సిఫారసు చేశారు. కానీ, కనీస పెన్షన్ను రూ.9000లకు పెంచితేనే ఈపీఎస్-95 పెన్షనర్లకు నిజమైన బెనిఫిట్ లభిస్తుందని భావిస్తున్నారు.
ఉద్యోగి లేదా కార్మికుడి చివరి నెల వేతనం ఆధారంగా పెన్షన్ను ఖరారు చేయాలన్న సూచన కూడా వచ్చింది. ఈ సూచనతోపాటు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం కింద నూతన వేతన కోడ్ అమలు తదితర ముఖ్యమైన అంశాలపై కార్మికశాఖ ఆధ్వర్యంలో జరిగే ఈపీఎఫ్వో బోర్డు భేటీలో చర్చకు రావచ్చునని తెలుస్తున్నది.