Yezdi Bike | ముంబై, సెప్టెంబర్ 30: వాహన విక్రయాలను పెంచుకోవడానికి యెజ్డీ కంపెనీ వినూత్నంగా ఆలోచించింది. దీంతో ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో జావా యెజ్డీ మోటర్‌సైకిళ్లు లభించనున్నాయి. అవును.. ఇప్పటిదాకా స్మార్ట్ఫోన్లు, టెలివిజన్లు ఇతర కన్జ్యూమర్ డ్యూరబుల్స్, గృహోపకరణాలు, దుస్తులు, పాదరక్షలు, కన్జ్యూమర్ గూడ్స్ మొదలగునవి అమ్ముతున్న ఫ్లిప్‌కార్ట్‌లో ఇకపై యెజ్డీ అమ్మకాలు జరుగుతాయని సోమవారం ఈ బ్రాండ్ మాతృ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగిందని, ఇది భారతీయ ప్రీమియం మోటర్‌సైకిల్ మార్కెట్లో కీలక పరిణామమని పేర్కొన్నది.
ఫ్లిప్‌కార్ట్‌తో జట్టు కట్టడం వల్ల అందులోని 50 కోట్లకుపైగా కస్టమర్లకు తమ బ్రాండ్ చేరువ కాగలదన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా క్లాసిక్ లెజెండ్స్ సీఈవో ఆశిష్ సింగ్ జోషి వ్యక్తం చేశారు. ఇదిలావుంటే ఫ్లిప్‌కార్ట్‌లో యెజ్డీ మోటర్‌సైకిళ్ల కొనుగోలుపై నో-కాస్ట్ ఈఎంఐ, బై నౌ-పే లేటర్ స్కీములు, డౌన్ పేమెంట్ లేకుండా ఈఎంఐ ప్లాన్ల వంటివీ అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. కస్టమర్లు ఎంపిక చేసిన మాడళ్లపై రూ.22,500 విలువైన ప్రయోజనాలనూ పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగం తదితర మార్గాల ద్వారా వీటిని అందుకోవచ్చు. కాగా, జావా, యెజ్డీ, బీఎస్ఏ శ్రేణిలో క్లాసిక్ మోటర్‌సైకిళ్ల బ్రాండ్లున్నాయి.