OTT On No Tobacco | సినిమా థియేటర్లలో మాదిరిగానే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు తప్పనిసరి జారీ చేయాలన్న నిబంధనపై ఓటీటీ వేదికలు వ్యతిరేకిస్తున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇతర వినోద కార్యక్రమాల్లో కూడా ఈ నిబంధన పాటించాలని కేంద్రం షరతు విధించింది. దీనిపై ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కేంద్రం నిబంధనను సవాల్ చేయాలని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ యాజమాన్యాలు నిర్ణయించినట్లు సమాచారం.
‘పొగాకు వినియోగం క్యాన్సర్ కారకం, పొగాకు వినియోగం ప్రాణాంతకం` అని సినిమా థియేటర్లు, టీవీ చానెళ్లలో ప్రదర్శించినట్లే ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందూ, తర్వాత కనీసం 30 సెకన్లు ప్రదర్శించాలి.. తద్వారా పొగాకు వినియోగంతో తలెత్తే దుష్ప్రభావాన్ని వివరించాలని ఓటీటీ వేదికల యాజమాన్యాలకు కేంద్రం తేల్చి చెప్పింది. అంతే కాదు పొగాకు ఉత్పత్తుల వినియోగ ద్రుశ్యాలు వచ్చినప్పుడు డిస్ క్లయిమర్ కూడా చూపాలని తెలిపింది. ఓటీటీ కంటెంట్ ప్రసారం అయ్యే భాషలోనే ఈ హెచ్చరికలు ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
ఈ నిబంధన మీద ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. హెచ్చరికలను జోడించడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్న లక్షల గంటల కంటెంట్ ఎడిటింగ్ చేయడం తలకు మించిన భారంగా భావిస్తున్నాయి. దీనిపై చర్చించడానికి అమెజాన్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ, జియో సినిమా ప్రతినిధులు సమావేశమై చర్చించుకున్నట్లు సమాచారం.