Mutual Funds | న్యూఢిల్లీ, డిసెంబర్ 28: దేశీయ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మహిళా పెట్టుబడిదారులు భారీగా పెరుగుతున్నారు. ప్రస్తుత సంవత్సరంలో చిన్న, మధ్యస్థాయి నగరాల నుంచి అత్యధిక మంది మహిళలు ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారని, గడిచిన ఏడాదికాలంలో వీరి సంఖ్య రెండున్నర రెట్లు పెరిగినట్లు ఆన్లైన్ బ్రోకరేజ్ సంస్థ గ్రోవ్ తెలిపింది. మహిళల్లో ఆర్థిక స్వావలంభన పెరుగుతున్నదని, ముఖ్యంగా పట్టణ, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలతోపాటు చిన్న స్థాయి నగరాల్లో సైతం 140 శాతం పెరిగిందని, దీంతో వీరు ఈక్విటీ మార్కెట్లతోపాటు ఎంఎఫ్ మార్కెట్లలో విరివిగా పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించింది. మిగతా రంగాలకు దూరంగా ఉంటున్న మహిళలు..ఈక్విటీ, ఫండ్లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు, ఈ ఏడాది కోటి మందికి పైకి చేరుకున్నారని గ్రోవ్ కో-ఫౌండర్, సీఈవో లలిత్ కేశ్రా తెలిపారు.
గడిచిన ఏడాదికాలంలో మెట్రో, టైర్-1,2,3 నగరాల్లో ఫండ్లలో పెట్టుబడులు పెట్టే మహిళలు 100 శాతం చొప్పున పెరిగారు. నగరాల వారీగా చూస్తే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పూణె, లక్నో, అహ్మదాబాద్, జైపూర్ వంటి మెట్రో నగరాల నుంచి అత్యధిక మంది మహిళలు మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేశారు. అలాగే పురుషుల కంటే సిప్‌లలో మహిళలు అత్యధికంగా పెట్టుబడులు పెట్టడం విశేషం. ఈ ఏడాది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఏయూఎం రూ.17 లక్షల కోట్ల మేర పెరిగిందని ఆంఫీ తెలిపింది. డిసెంబర్ 2023లో రూ.50.79 లక్షల కోట్లుగా ఉన్న ఫండ్ ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.68 లక్షల కోట్లకు చేరుకున్నది. అలాగే గత నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లో కొత్తగా 42.76 లక్షల మంది చేరారు. అలాగే గడిచిన నాలుగేండ్లుగా ప్రతియేటా 3 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ప్రారంభిస్తున్నారు.