సుకుమార్ ఓ మధ్యతరగతి ప్రైవేట్ ఉద్యోగి. నెలకు రూ.30,000 జీతం. ఏడాది కిందట రూ.3,000తో కిరాణా, కూరగాయల ఖర్చు తీరిపోయేది. కానీ ఇప్పుడు రూ.5,000 పెట్టాల్సి వస్తున్నది. చివరకు ఓసారి భార్యాభర్తల మధ్య గొడవలకూ ఇది దారితీసింది. ఆదాయం పెరగలేదు కానీ.. ఖర్చులు పెరిగాయి మరి. ఇదొక్క సుకుమార్ ఇంట్లోనే కాదు.. మనలో చాలామందిదీ ఇదే పరిస్థితి. మార్కెట్లో రోజుకో తీరున మారుతున్న ధరలతో ఇప్పుడు సామాన్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆహార ద్రవ్యోల్బణం ఏడాది వ్యవధిలో 5 శాతానికిపైగా ఎగిసి గత నెలలో 8.70 శాతాన్ని చేరింది. అంగట్లో ఆలుగడ్డ, ఉల్లిగడ్డ.. ఇలా ఏ కూరగాయల రేైట్లెనా మండిపోతున్నాయిప్పుడు. పప్పు దినుసుల సంగతి సరేసరి. దీంతో పేద, మధ్యతరగతి వర్గాల వంటింటి బడ్జెట్ తలకిందులైపోయింది.
న్యూఢిల్లీ, మే 14: కొనబోతే కొరివే అన్నట్టు తయారైంది సగటు మనిషి బతుకు. కడుపునిండా కూడు లేక చాలీచాలని మెతుకులతో సరిపెట్టుకోవాల్సి వస్తున్నది సామాన్యులకు. ఆదాయం అంతంతే ఉంటున్నదిగానీ.. ఖర్చులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి మరి. వస్తువు ఏదైనా, ఉత్పత్తి ఏమైనా చూసి ఉసూరుమనడమే తప్ప.. కొని అక్కెర తీర్చుకునే అవకాశం లేక పేద, మధ్యతరగతి వర్గాలు కాలం వెళ్లదీస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ధరలు పుట్టిస్తున్న మంటలకు.. మంగళవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ద్రవ్యోల్బణం అధికారిక గణాంకాలే నిదర్శనం. హోల్‌సేల్ మార్కెట్లో ధరలు (డబ్ల్యూపీఐ) ఏకంగా 13 నెలల గరిష్ఠాన్ని తాకుతూ గత నెల ఏప్రిల్‌లో 1.26 శాతంగా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే రిటైల్ మార్కెట్లోనూ ఆహార ధరలు 8.70 శాతాన్ని చేరాయి. నిజానికి గత ఏడాది ఏప్రిల్‌లో 3.84 శాతంగానే ఉండటం గమనార్హం. ఇక నిరుడు ఏప్రిల్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 0.79 శాతంగా ఉన్నది. టోకు ఆహార ద్రవ్యోల్బణం 4 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 7.74 శాతంగా ఉన్నది.
ఈసారి ఎండలు దంచి కొడుతున్న విషయం తెలిసిందే. అయితే పెరుగుతున్న ఎండల తీవ్రత ఆయా ఆహార పంటలపై పెద్దగానే ప్రభావం చూపుతున్నది. దీంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక మార్కెట్లో ధరలకు రెక్కలు తొడుగుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది మార్చితో చూస్తే కూరగాయల ధరలు ఏప్రిల్‌లో 19.52 శాతం నుంచి 23.60 శాతానికి పెరిగాయి. ఆలుగడ్డ ధర 52.96 శాతం నుంచి 71.97 శాతానికి ఎగిసింది. ఉల్లిగడ్డ ధర 56.99 శాతం నుంచి 59.75 శాతం ఎగబాకింది.
ద్రవ్యోల్బణం వెనుక కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. భారత్.. వర్షాధార పంటల దేశం. వర్షాలు ఏటా సమృద్ధిగా పడవు. కాబట్టి మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్టుగా ఆయా ఉత్పత్తుల నిల్వల్ని ఎప్పుడూ ఉంచాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ధరలు స్థిరంగా ఉంటాయని వారు తెలియజేస్తున్నారు. నిల్వలు లేకనే నిత్యావసరాలు, ముఖ్యంగా మెజారిటీ పప్పు దినుసుల కిలో ధర సగటున రూ.150 పలుకుతున్నదని పేర్కొంటున్నారు. నిరుడు జూలై, ఆగస్టు నెలల్లోనూ ఆహార ద్రవ్యోల్బణం 15.09 శాతం, 11.43 శాతంగా ఉన్నదని గుర్తుచేస్తున్నారు. ఈ వర్షాకాలంలో నిరాశే ఎదురైతే ధరల కట్టడి కష్టంగానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
మార్కెట్లో చాలా వస్తూత్పత్తుల ధరలు గత కొద్దినెలలుగా పెరుగుతూపోతున్నాయి. దీన్నిబట్టి మే, జూన్ నెలల్లో డబ్ల్యూపీఐ సూచీ 2 శాతాన్ని దాటేలా ఉన్నది. దీనివల్ల దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ కూడా ప్రభావితం అవుతుంది.
ద్రవ్యోల్బణం తాజా గణాంకాల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వచ్చే నెల నిర్వహించబోయే ద్రవ్యసమీక్షలోనూ కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉంటాయన్న అంచనాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే దాదాపు ఏడాదిన్నరగా రెపోరేటు జోలికి వెళ్లకుండానే ఆర్బీఐ మానిటరీ పాలసీలను ముగించేస్తున్నది. కరోనా టైంతో పోల్చితే ఇప్పుడు వడ్డీరేట్లు చాలా ఎక్కువగా ఉన్నది తెలిసిందే. దీంతో అటు వ్యాపార, పారిశ్రామిక రంగాలు, ఇటు సామాన్య ప్రజానీకం వడ్డీరేట్లను తగ్గించాలని మొత్తుకుంటున్నా.. ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్న ఆర్బీఐ మాత్రం దిగిరావడం లేదు. ఈ క్రమంలో ఆహార ద్రవ్యోల్బణం విజృంభణ.. మరోమారు ఆర్బీఐ వడ్డీరేట్ల కోతకు అడ్డం పడేలా ఉన్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జూన్ 5-7 తేదీల్లో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను ఆర్బీఐ చేపట్టనున్నది.
