Twitter CEO Wealth | మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ సీఈవోగా భారతీయుడు పరాగ్ అగర్వాల్ నియమితులు అయ్యారు. అంతకుముందు సంస్థ కో-ఫౌండర్ జాక్ డోర్సీ వైదొలిగినట్లు ప్రకటించారు. ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియమితులు కావడంతో గ్లోబల్ టెక్ సీఈవోల క్లబ్లో మరొకరు చోటు దక్కించుకున్నట్లయింది.
మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్యనాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్, ఐబీఎం అధినేతగా అరవింద్ కృష్ణ, అడోబ్ చీఫ్ శంతను నారాయణ్, వీఎంవేర్ అధిపతి రఘురామ్ భారతీయులే. 2011లో ట్విట్టర్లో చేరి వివిధ బాధ్యతలు నిర్వర్తించిన పరాగ్ అగర్వాల్ 2017 అక్టోబర్‌లో సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవీ)గా, బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు. తనను సీఈవోగా ప్రతిపాదించినందుకు జాక్ డోర్సీ, ఆయన టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియామకంతో.. ఆ సంస్థతో భారత్ ప్రభుత్వ సంబంధాలు మెరుగు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల టూల్ కిట్ వివాదం తలెత్తడంతో ట్విట్టర్ ఇండియా ఎండీని పూర్తిగా తొలగించింది. ఒక టీమ్ సారధ్యంలో సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయి. ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన పరాగ్ అగర్వాల్ వ్యక్తిగత నికర సంపద 1.52 మిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా.