ముంబై, ఏప్రిల్ 2: దేశీయ జాబ్ మార్కెట్‌ను నీరసం ఆవహించింది. గత నెల మార్చిలో వివిధ రంగాల్లో వైట్-కాలర్ హైరింగ్ తగ్గుముఖం పట్టినట్టు ఓ తాజా నివేదికలో తేలింది. గత ఏడాది మార్చితో పోల్చితే ఈసారి 1.4 శాతం మేర నియామకాలు పడిపోయినట్టు బుధవారం విడుదలైన నౌకరీ.కామ్ రిపోర్టు చెప్తున్నది. దేశ, విదేశాల్లో నెలకొన్న పలు ప్రతికూల పరిస్థితులు.. ఆయా రంగాలను నిస్తేజంలోకి నెడుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్తగా ఉద్యోగ-ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.
ఈ ఏడాది మార్చిలో రిటైల్, చమురు-గ్యాస్, విద్యా రంగాల్లో వైట్-కాలర్ కొలువుల్లోకి రిక్రూట్మెంట్లు పడిపోయాయి. నిరుడు మార్చితో పోల్చితే రిటైల్‌లో 13 శాతం, చమురు-గ్యాస్‌లో 10 శాతం, విద్యా రంగంలో 14 శాతం చొప్పున కొత్త నియామకాలు దిగజారాయని జాబ్‌స్పీక్ ఇండెక్స్ డాటా ఆధారంగా నౌకరీ.కామ్ రూపొందించిన నివేదికలో తేటతెల్లమైంది. నౌకరీ జాబ్‌స్పీక్ అనేది ఓ నెలవారీ సూచీ. ఇది నౌకరీ.కామ్ డాటాబేస్ రెజ్యూమ్‌పై రిక్రూటర్లు చేసే ఉద్యోగ సంబంధిత అన్వేషణలు, కొత్త ఉపాధి అవకాశాల ఆధారంగా భారతీయ జాబ్ మార్కెట్, నియామక కార్యకలాపాలను ప్రతిబింబిస్తుంది. కాగా, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికైన దగ్గర్నుంచి.. మారిన దేశ, విదేశీ మార్కెట్ పరిస్థితులు నియామకాలను పెద్ద ఎత్తునే ప్రభావితం చేస్తున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కఠిన వీసా నిబంధనలు, ప్రతీకార సుంకాలు, వాణిజ్య ఆంక్షలు.. కంపెనీలను దెబ్బతీస్తున్నాయంటున్నారు.
ఈ ఏడాది మార్చిలో యునికార్న్ హైరింగ్ పవర్‌హౌజ్‌గా చెన్నై నిలిచింది. చెన్నైకి చెందిన స్టార్టప్ సంస్థలు రిక్రూట్మెంట్లలో 29 శాతం వృద్ధిని కనబర్చాయి. ఈ విషయంలో ఢిల్లీ-ఎన్సీఆర్ 23 శాతంతో రెండో స్థానంలో ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లోని యునికార్న్‌లు 17 శాతంతో సరిపెట్టుకున్నాయి. కాగా, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ యునికార్న్‌లు దూకుడు మీదున్నాయి. నియామకాల్లో ఈ రంగాల సంస్థలు 36 శాతం వృద్ధిని చూపాయి. రూ.8,500 కోట్లు విలువ కలిగిన స్టార్టప్ కంపెనీలనే యునికార్న్లుగా పిలుస్తారన్న సంగతి విదితమే.