ఫోర్ వీలర్.. ఇప్పుడు దాదాపుగా అందరి ఇండ్లల్లోనూ ఉంటున్నది.
నగరాల్లోనే కాదు.. ప్రథమ, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా కారు సర్వసాధారణమైపోయిందంటే అతిశయోక్తి కాదుమరి. అయినప్పటికీ ఇది బడ్జెట్‌తో కూడుకున్న వ్యవహారమే.
అందుకే చాలామంది నేడు కొత్త కార్లను కాదని, పాత కార్లను చూస్తున్నారు. దీంతో ప్రస్తుతం యూజ్డ్ కార్ మార్కెట్‌కే డిమాండ్ ఉంటున్నది. ధర తక్కువ కావడమే ఇందుకు కారణం. అయితే రుణాలతో కొంటున్నారు. ఇది లాభమేనా?
Used cars | యూజ్డ్ కార్ల మార్కెట్ పెద్ద ఎత్తున విస్తరిస్తూపోతున్నదిప్పుడు. కొనుగోలుదారుల కోసం సరికొత్త వేదికలెన్నో పుట్టుకొస్తున్నాయి కూడా. చివరకు మారుతీ, మహీంద్రా, హ్యూందాయ్ వంటి ప్రధాన సంస్థలు సైతం యూజ్డ్ కార్ల కోసం ప్రత్యేక ఔట్‌లెట్స్‌ను తెరుస్తున్నాయంటే పాత కార్లకు ఏ రకమైన గిరాకీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు కూడా యూజ్డ్ కార్లకు లోన్లు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. కానీ అసలు మెలికంతా ఇక్కడే ఉందని గమించాలి. వడ్డీరేట్లతో మీ నడ్డి విరిగే అవకాశాలే ఎక్కువమరి.
కొత్త కారుకున్న కిక్కే వేరు. అందుకే దీని రేటు ఎక్కువగానే ఉంటుంది. అందుకు తగ్గట్టే వాహనదారులకు ఐదారేండ్లదాకా ఎటువంటి ఇబ్బందులూ ఉండవనీ మరువద్దు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా కొత్త కార్లకు లోన్లు ఇచ్చేందుకు సిద్ధంగానే ఉంటాయి. అయితే సెకండ్ హ్యాండ్ కార్ల విషయానికొస్తే.. కారు అప్పటికే ఎంతో కొంత తిరిగి ఉంటుంది. కారులోని ప్రతీదీ పాతదైపోతుంది. ఈ క్రమంలోనే కొత్త దానితో పోల్చితే కనీసం 25-30 శాతానికి మించే తక్కువ ధరకు లభిస్తుంది. అయితే రీసేల్ చేయాల్సి వచ్చినప్పుడు మరింత తక్కువ రికవరీ వాల్యూ ఉంటుందన్నది గుర్తుంచుకోవాలి. అందుకే రుణదాతలకు యూజ్డ్ కార్ లోన్.. ఒకింత రిస్కీ బిజినెసే. కాబట్టే రుణగ్రహీతల నుంచి అధిక రివార్డ్ దక్కాలని బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ కంపెనీలు చూస్తాయి.
కొత్త కారు కొనాలనుకున్నవాళ్లకు ఆకర్షణీయ క్రెడిట్ స్కోర్ ఉంటే మార్కెట్లో 95 శాతం వరకూ ఫైనాన్స్ దొరుకుతోంది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ఆటోలోన్ వడ్డీరేట్లు సుమారు 8.6 నుంచి 11 శాతం వరకూ ఉంటున్నాయి. కొత్త కార్లకు కనిష్ఠంగా 8.65 శాతం వడ్డీకి వాహన రుణం లభిస్తున్నది. గరిష్ఠంగా రుణ కాలపరిమితి 7-8 ఏండ్లు ఉంటున్నది. అదే పాత కార్లకు వడ్డీరేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని బ్యాంకులు దాదాపు 16 శాతం వరకూ వడ్డీని వసూలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకింగేతర సంస్థలైతే 19-20 శాతం వసూలు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది బయట మార్కెట్లో దొరికే రూపాయిన్నర, రెండు రూపాయల వడ్డీతో సమానం. ఈ స్థాయిలో వడ్డీని మనం చెల్లిస్తే.. అసలు కూడా మూడేండ్లకే డబుల్ అయిపోతుందనే విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంత వడ్డీతో యూజ్డ్ కార్ కొనడం అంత అవసరమా అని కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి.
15-20 శాతం వడ్డీతో ఆటోలోన్ తీసుకోవడం కంటే ఇతర మార్గాలు ఏమేం ఉన్నాయో ఆలోచించాలి. ఈ క్రమంలో గోల్డ్ లోన్, మ్యూచువల్ ఫండ్స్ పూచీకత్తు రుణాలు, హోమ్ లోన్ టాప్ అప్స్, పర్సనల్ లోన్స్ వంటివి కూడా పరిగణనలోకి తీసుకోవడంలో ఎంత మాత్రమూ తప్పులేదు. ఉదాహరణకు హోమ్ లోన్ ఇప్పటికే మీకు ఉందని అనుకుందాం. మీ క్రెడిట్ హిస్టరీ, రీ పేమెంట్స్ బాగుంటే బ్యాంక్ మీకు టాప్ అప్ లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అది కూడా 9 నుంచి 10 శాతంలోపే దొరికిపోతుంది. ఇది మీకు బెస్ట్ ఆప్షన్ కావచ్చు. అదే సమయంలో మీకు ఏదైనా పెట్టుబడులు ఉన్నాయనుకుందాం. ఫిక్స్డ్ డిపాజిట్స్, ఎల్ఐసీ బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివి. వాటిపై కూడా మీరు లోన్ పొందవచ్చు. యూజ్డ్ కార్ లోన్‌పై వడ్డీ కంటే ఇవి కచ్చితంగా తక్కువే ఉంటాయి. బంగారం రుణాలు కూడా బెస్ట్ ఆప్షన్. ఒకవేళ పర్సనల్ లోన్ కూడా మీ క్రెడిట్ స్కోర్ బాగుండటం వల్ల తక్కువకు లభిస్తూ ఉంటే.. ఆ ఆప్షన్ని కూడా తీసుకోవచ్చు. 4-5 శాతం వడ్డీ ఎక్కడ తగ్గినా తగ్గినట్టే! కొన్నేండ్లపాటు మీ పెట్రోల్, డీజిల్ ఖర్చులకైనా ఇవి ఉపయోగంగా ఉంటాయి.
చంద్రయాన్-3 ల్యాండింగ్‌తో ఇంజనీరింగ్ షేర్ల ర్యాలీ, ప్రపంచ సానుకూల మార్కెట్ల ప్రభావంతో గత వారం ప్రధమార్థంలో 19,584 గరిష్ఠస్థాయివరకూ పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ శుక్రవారం భారీగా తగ్గి 19,265 పాయింట్ల వద్ద ముగిసింది. వారం మొత్తంమీద 44 పాయింట్ల నష్టపోయింది. ఆగస్టు డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఈ వారం నిఫ్టీ దిగువ శ్రేణిలో ఒడిదుడుకులకు లోనవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 250 డీఎంఏ దిగువన ముగియడం బేరిష్ సంకేతమని యాక్సిస్ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ హెడ్ రాజేశ్ పాల్వియా చెప్పారు. కీలక మద్దతును కోల్పోయినందున, ఈ మంథ్లీ ఎక్స్పైరీ వీక్‌లో బేర్స్‌దే పైచేయి అవుతుందని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోది అంచనా వేశారు.
నిఫ్టీ ఆప్షన్ డాటా ప్రకారం ఆప్షన్ రైటర్లు దిగువ శ్రేణికి షిఫ్ట్ అయ్యారని, 19,300, 19,400 స్థాయిల వద్ద భారీగా కాల్ రైటింగ్, 19,200, 19,000 స్థాయిల వద్ద పుట్ రైటింగ్ జరిగిందని రాజేష్ పాల్వియా వివరించారు. ఈ నేపథ్యంలో నిఫ్టీకి 19,350 అవరోధస్థాయి కీలకమని, ఈ స్థాయిని అధిగమించకపోతే 19,000 స్థాయికి తగ్గే అవకాశం ఉందని రాజేశ్ పాల్వియా అంచనా వేశారు. వేగంగా 19,300 పైన ముగియకపోతే, 19,000-18,800 శ్రేణి వరకూ పతనం అయ్యే ప్రమాదం ఉంటుందని జిమిత్ మోది తెలిపారు. కొద్ది వారాలకు ముందు గట్టిగా నిరోధించినందున ఈ శ్రేణి ఇప్పుడు పటిష్ఠ మద్దతును అందించవచ్చని విశ్లేషించారు.
– నాగేంద్ర సాయి కుందవరం