Credit Card – UPI | డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించడానికి ఆర్బీఐ యూపీఐకి క్రెడిట్ కార్డులను అనుసంధానించింది. రూపే క్రెడిట్ కార్డుల వినియోగదారులకు ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. అయితే దీనివల్ల బెనిఫిట్లతోపాటు ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇంతకుముందు బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉంటేనే యూపీఐ పేమెంట్స్ చేసే వెసులుబాటు ఉంది. కానీ తాజాగా ఆర్బీఐ తెచ్చిన విధానంతో యూపీఐకి క్రెడిట్ కార్డు లింక్ చేయడంతోపాటు.. సంబంధిత బ్యాంక్ ఖరారు చేసిన క్రెడిట్ పరిమితి వరకూ పేమెంట్స్ చేయొచ్చు. ఇలా వాడుకునే క్రెడిట్’ను తిరిగి చెల్లించడానికి తమ ఖాతాదారులకు క్రెడిట్ కార్డు జారీ సంస్థలు కొంత టైం ఇస్తాయి.
క్రెడిట్ కార్డు పేమెంట్స్ మీద రివార్డు పాయింట్లు లభిస్తాయి. సేవింగ్స్ ఖాతా ద్వారా జరిపే పేమెంట్స్ మీద ఏ రివార్డులు లభించవు. క్రెడిట్ కార్డుతో చేసే యూపీఐ పేమెంట్స్ మీద రివార్డు పాయింట్లు వస్తాయి. యూపీఐతో క్రెడిట్ కార్డులను అనుసంధానించడం వల్ల చెల్లింపులు తేలికవుతాయి. ఒక చోట క్రెడిట్ కార్డు, మరొక చోట యూపీఐ యాప్ సాయంతో చెల్లింపులు చేయాల్సిన అవసరం రాదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే.. క్రెడిట్ కార్డు లేకుండానే చెల్లింపులు జరుపవచ్చు. పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) కార్డు స్వైపింగ్ మిషన్ లేని చిన్న దుకాణాల్లోనూ యూపీఐ యాప్ ద్వారా క్రెడిట్ కార్డుతో బిల్లు చెల్లించొచ్చు.
యూపీఐతో చేసే చిన్నపాటి పేమెంట్స్ కూడా బ్యాంకు స్టేట్మెంట్లో వస్తాయి. ఆ చెల్లింపులపై తీసుకునే స్టేట్ మెంట్ చాలా పెద్దదిగా ఉంటుంది. క్రెడిట్ కార్డు ద్వారా చేసే పేమెంట్స్ మీద బ్యాంక్ స్టేట్మెంట్ క్లియర్‌గా ఉంటుంది. క్రెడిట్ కార్డు స్టేట్మెంట్లోనే పేమెంట్ డిటైల్స్ రికార్డవుతాయి. కానీ రూపే క్రెడిట్ కార్డు యూజర్లకు మాత్రమే యూపీఐ యాప్ అనుసంధానానికి అవకాశం ఉంది. మాస్టర్ కార్డ్, వీసా వంటి నెట్‌వర్క్‌లతో పని చేసే క్రెడిట్ కార్డులకు ఈ ఫెసిలిటీ వర్తించదు.
వ్యక్తిగత యూపీఐ ఐడీ వాడే బుల్లి వ్యాపారులకు క్రెడిట్ కార్డులతో యూపీఐ పేమెంట్స్ వీలు కాదు. బ్యాంకు ఖాతాలో మనీ లేకున్నా, క్రెడిట్ కార్డు వాడే అవకాశం ఉండటంతో కొనుగోళ్లపై నియంత్రణ తగ్గుతుంది. ఖర్చులు పెరిగిపోయి అనవసరంగా రుణాల ఊబిలో చిక్కుకునే ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ విధించడం వల్ల వ్యాపారులపై భారం పడుతుంది. అంటే ప్రతి క్రెడిట్ కార్డు పేమెంట్ మీద వ్యాపారులు చార్జీలు పే చేయాలి. కనుక వారు క్రెడిట్ కార్డు చెల్లింపులను నిరాకరించడానికి అవకాశం ఉంటుంది.