Investment Plans | ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకునే మంచి అలవాట్లే వారిని సక్సెస్ వైపు తీసుకెళ్తాయి. ఆర్థికాంశాల్లో కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. పొదుపు చేయాలంటే మొదటి నుంచి భారీ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు చేయడం కాదు.. చిన్న మొత్తాలు ఉదాహరణకు మొదట్లో రూ.500 నుంచి పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేయడంతో ఆదా చేయడం ప్రారంభించొచ్చు. మొదట్లో పొదుపు చేయడం అలవాటైతే క్రమంగా అది ఒక పాలసీగా మారుతుంది.. అలా చేస్తూ వెళ్లడం వల్ల మంచి రిటర్న్స్ పొందొచ్చు. కనుక మీ సంపాదనలో అత్యధిక శాతం పొదుపు చేయడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఖర్చులు కంట్రోల్ చేయాలి. మంచి ఫైనాన్సియల్ అలవాట్లు గల వారికే ఇది సాధ్యం అవుతుంది. మంచి అలవాట్లు అంటే ఏమిటో తెలుసుకుందామా..?
ఏ పనికోసమైనా ముందుగా ప్రణాళిక వేసుకోవడం అలవాటుగా మారాలి. నెలసరి ఆదాయాన్ని తీసుకుంటే అందులో ఎంత పొదుపు చేయాలి, ఎంత ఖర్చు చేయాలి అనే అంశాలు నిర్ణయించుకోవాలి. ఖర్చులు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఎక్కువ మొత్తంలో ఆదా చేయగలుగుతాం. ప్రతి ఒక్కరికీ ప్రత్యేకించి పిల్లల విద్యావకాశాలు, రిటైర్మెంట్, కూతుళ్లు ఉంటే వారి పెండ్లిండ్ల వంటి ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. ఆదా చేసిన మొత్తంలో ఏ లక్ష్యం కోసం ఎంత కేటాయించాలి.. ఎక్కడ ఏయే పథకాల్లో పొదుపు చేయాలో ప్లాన్ చేసుకోవడం ముఖ్యం.
ఇప్పుడు జీవనశైలిలో పలు మార్పులొచ్చాయి. దీంతో ఖర్చులు కూడా పెరిగిపోయాయి. కొన్ని సార్లు వద్దనుకున్నా మిత్రుల ఒత్తిళ్లతో ఆదాయాన్ని మించి ఖర్చు చేయాల్సి రావచ్చు. ఇటువంటి ధోరణులు ప్రమాదకరం. అనవసర ఖర్చుల ధోరణులకు దూరంగా ఉండండి. ఖర్చులపై పరిధి విధించుకోవాలి. దాన్ని మించకుండా ఎల్లవేళలా ప్రయత్నించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అప్పులు ప్రతి ఒక్కరి జీవితాలను తారుమారు చేస్తాయి. ప్రతి ఒక్కరూ తాము చేసే అప్పులతో వారి ఆర్థిక ప్రణాళిక దెబ్బ తింటుంది. కనుక లోన్ల విషయంలో అలర్ట్‌గా ఉండాలి. పరిమితికి లోబడి రుణాలు తీసుకోవాలి. ఏ వస్తువైనా కొంటే దాని విలువ ఫ్యూచర్లో కనిపించాలి.
ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే వారి నైపుణ్యం పెంచుకుని ఫ్యూచర్లో మరింత సొమ్ము ఆర్జించడానికి వీలవుతుంది. ఇంటి లోన్ తీసుకుంటే సొంతిల్లు ఏర్పాటు చేసుకోగలం. ఆదాయం పెంచుకునే మార్గాలు.. నిశ్చింత కలిగించే, జీవితంలో స్థిరత్వానికి (సొంతింటి) రుణాలు తీసుకోవడంలో తప్పేమీ లేదు. అనవసర విలాసాల కోసం అప్పులు చేయడం సరి కాదని నిపుణులు చెబుతున్నారు. తక్కువ వడ్డీకే రుణాలు వస్తున్నాయని తీసుకుంటే.. తర్వాతీ కాలంలో వడ్డీరేట్లు పెరుగుతాయి.. తదనుగుణంగా నెలవారీ ఈఎంఐలు పెరిగి భారంగా మారతాయి. ఇటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఏడాదికోసారి రుణాలు చెక్ చేయండి.. ఎక్కువ వడ్డీ గల రుణాలు ముందే చెల్లించడానికి ట్రై చేయండి.
డబ్బంతా ఒకేచోట పొదుపు చేయడం కూడా సరైన చర్య కాదు. రిస్క్ తక్కువగా ఉన్న వాటిల్లోనే పెట్టుబడి పెట్టాలి. రిటర్న్స్ ఎక్కువ అని చెప్పి మొత్తం సొమ్ము ఒకే స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం సరికాదు.. విభిన్న పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌తో ఒక దాంట్లో నష్టం వచ్చినా.. మరొకదాంట్లో లాభంతో రిస్క్ తగ్గుతుంది. ప్రతి నెలా వచ్చే ఇన్‌కంలో కొంత హోంరెంట్, కరంట్.. వాటర్ తదితర యుటిలిటీ బిల్లులు, కుటుంబ సభ్యుల ఎంటర్టైన్మెంట్ తదితర ఖర్చుల కోసం కేటాయించాలి. మరికొంత పిల్లల చదువులు, కెరీర్ కోసం పొదుపు చేయాలి. దాంతోపాటు ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత జీవితం కోసం కొంత మొత్తం ఆదా చేయాలి. అలా సుదీర్ఘ కాలం పొదుపు చేయడం వల్ల పెద్ద కార్పస్ ఫండ్ అవుతుంది. రిటైర్మెంట్ తర్వాత జీవితానికి భరోసాగా నిలుస్తుంది.
కుటుంబ సభ్యుల సహకారంతోనే ఏదైనా చేయగలం. మన నిర్ణయాలు కుటుంబ సభ్యుల్ని ప్రభావితం చేస్తాయి. ఆర్థిక విషయాల్లో ఫ్యామిలీ మెంబర్లతో చర్చించడం అలవాటుగా మార్చుకోవాలి. వారి కంటే డబ్బు విషయాల్లో నమ్మే వ్యక్తులెవరూ ఉండరు. ఆరోగ్యకరమైన అలవాట్లు శారీరక, మానసిక ప్రశాంతతనిస్తాయి. డిసిప్లిన్ లేని వారు ఎంత కష్టపడ్డా ఫలితం శూన్యమే. ఒక పద్దతి ప్రకారం క్రమశిక్షణతో ముందుకు సాగితే కొద్ది మొత్తం ఆదా చేసినా సంపద సృష్టించడం సాధ్యమే. మంచి అలవాట్లు మీ లక్ష్యాలు వేగంగా చేరుకోవడానికి దోహద పడతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.